‘టేకోలాక్’ దోపిడీ
- సంగారెడ్డి విద్యుత్ శాఖ సర్కిల్‌లో అవినీతి దందా
- చక్రం తిప్పుతున్న అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్
- రెండేళ్ల నుంచి రూ.50 కోట్ల విలువైన పనులు తన గుప్పిట్లో
- పర్సంటేజీ కింద చేయితడిపితేనే ఫైల్ క్లియర్.. లేదంటే పెండింగ్
- ఇబ్బంది పడుతున్న ఇంజినీర్లు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్
సంగారెడ్డి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): సంగారెడ్డి విద్యుత్ సర్కిల్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. అక్కడ పనిచేస్తున్న అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ (ఏఏఓ) చక్రం తిప్పుతూ కాంట్రాక్టర్లను, అధికారులను నిలువునా దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వర్క్ ఆర్డర్లను ‘టేకోలాక్’ మోడ్ లోకి పంపి.. వాటిని తిరిగి సాధారణ స్థితికి తేవడానికి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తునా యని. రెండేళ్లుగా సాగుతున్న ఈ అక్రమ దందాలో ఇప్పటికే కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తున్నది.
బిల్లుల మంజూరు నుంచి సామగ్రి డ్రా చేసే వరకు ప్రతి విషయంలోనూ ఈ అధికారి కనుసన్నల్లోనే వ్యవహారం నడుస్తున్నట్లు వినికిడి. సాధారణంగా విద్యుత్ పనుల కోసం మంజూరైన వర్క్ ఆర్డర్లు నిర్ణీత సమయంలో పూర్తి కాకపోతే అవి సాంకేతికంగా ‘టేకో’ మోడ్ లోకి వెళ్తాయి. సివిల్ పనులు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి ప్రతి పనిలోనూ ఆయన జోక్యం ఉంటుంది.
సబ్‌స్టేషన్ల నిర్వహణ నుంచి చెట్లు నరకడం వరకు జరిగే అన్ని రకాల పనుల వర్క్ ఆర్డర్లను ఏఏఓ తన నియంత్రణలో ఉంచుకుంటున్నారు. సుమారు 50 కోట్ల రూపాయల పైచిలుకు విలువైన పనులకు సంబంధించి బిల్లుల మంజూరు లో ఆయన మాటే శాసనంగా మారింది. ముఖ్యంగా పనులకు అవసరమైన సామగ్రిని జిల్లా స్టోర్ నుంచి తీసుకునే ప్రక్రియలో ఆయన చక్రం తిప్పుతున్నారు.
దందా ఇలా..
ఒకసారి ఈ మోడ్ లోకి వెళ్తే సదరు పనులకు సంబంధించి స్టోర్ నుంచి సామగ్రి తీసుకోవడం గానీ, చేసిన పనులకు బిల్లులు పొందడం గానీ సాధ్యం కాదు. ఈ మెలికనే సదరు అధికారి ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు. టేకో మోడ్ నుంచి వర్క్ ఆర్డర్ ను విడుదల చేయాలంటే ఐదు శాతం కమీషన్ ఇవ్వాలనే అలిఖిత చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు సుమారు రూ.50 కోట్ల పైచిలుకు బిల్లుల వ్యవహారంలో సదరు అధికారి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. జిల్లా స్టోర్‌లో సామగ్రి కొరత ఉండటం ఈ అవినీతికి మరింత ఆసరాగా మారింది.
పనుల మంజూరుకు వచ్చినా, స్టోర్‌లో సామగ్రి మొత్తం ఒకేసారి దొరకదు. దీంతో సెక్షన్ అధికారులు ఉన్న సామగ్రితోనే పనులు పూర్తి చేయిస్తారు. మిగిలిన సామగ్రి కోసం ఎదురుచూసే సమయంలో వర్క్ ఆర్డర్లు టేకో మోడ్‌లోకి వెళ్లిపోతున్నాయి. వీటిని క్లియర్ చేయాలంటే ఏఏఓ మెయిల్ పెట్టడమో లేదా పైఅధికారులతో మాట్లాడటమో చేయాలి. ఈ ప్రక్రియను సదరు అధికారి తన గుప్పెట్లో పెట్టుకుని కింది స్థాయి ఇంజినీర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
అమ్యామ్యా సమర్పించుకోవాల్సిందే
కేవలం టేకో మోడ్ మాత్రమే కాకుండా బిల్లుల చెల్లింపుల్లోనూ పర్సెంటేజీల పర్వం కొనసాగుతున్నది. డివిజన్ల నుంచి వచ్చే బిల్లులకు ఎల్‌ఓసీ మంజూరు కావాలంటే రెండు శాతం అదనంగా ముట్టజెప్పాల్సిందే. ఈ మొత్తాన్ని వసూలు చేయడానికి ఒక ప్రత్యేక బందం పనిచేస్తున్నట్లు సమాచారం. డబ్బులు ఇస్తేనే ఫైళ్లు ముందుకు కదులుతాయని, లేదంటే నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఈ అధికారి తీరు వల్ల మొత్తం విద్యుత్ శాఖకే చెడ్డపేరు వస్తోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగారెడ్డి సర్కిల్ లో వందల కోట్ల పనులు జరుగుతుంటాయి.
ఇంతటి కీలకమైన చోట ఒక అధికారి వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని అవినీతికి పాల్పడుతుండటం కలకలం రేపుతోంది. ఉన్నతాధికారులు స్పందించి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని బాధితులు కోరుతున్నారు. లేదంటే సామాన్య వినియోగదారులకు అందాల్సిన విద్యుత్ సేవలు మరిన్ని ఆటంకాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ అక్రమ వసూళ్ల పర్వానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఆ శాఖ ఉన్నతాధికారులపై ఉంది.






