29 April, 2026 | 2:48 AM

సర్కారు బడుల్లో సోలార్ వెలుగులు

29-04-2026 01:14 AM

తాజాగా అన్ని పాఠశాలల్లో అమలుకు శ్రీకారం

2 నుంచి 10 కిలోవాట్ల సామర్థ్యంతో..

కిలోవాటుకు రూ.లక్ష చొప్పున నిధులు

సంగారెడ్డి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): సర్కారు బడుల్లో సోలార్ కాంతులు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ద్వారా ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రక టించింది. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది పలు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ మేరకు విద్యుత్ సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సోలార్ విద్యుత్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలో ఇంకా ఎలాంటి గైడ్లైన్స్ రాలేదని విద్యాధికారులు చెబుతున్నారు. గతంలో సీఎస్‌ఆర్ నిధులతో ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో ప్యానళ్ళను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకైతే ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం అన్ని సర్కారు బడుల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. 

తగ్గనున్న విద్యుత్ భారం..

సోలార్ ఏర్పాటుతో సర్కారు బడుల్లో విద్యుత్ బిల్లుల భారం తగ్గనుంది. ప్రభుత్వ సంస్థల్లో ఉత్పత్తి చేస్తున్న సోలార్ విద్యుత్ అవసరం మేరకు వాడుకొని మిగిలిన దాన్ని వదిలేసే పరిస్థితి ఉంది. ఇకపై అలా కాకుండా అవసరాల మేరకు వినియోగించుకొని మిగిలిన దాన్ని గ్రిడ్ ద్వారా డిస్కౌంట్లకు విక్రయించుకునే అవకాశం ఉంది. బడుల్లో కంప్యూటర్లు, ఫ్యాన్లు, మోటార్ నడవడానికి ఎక్కువ కరెంట్ వినియోగిస్తున్నారు.

సోలార్ ప్యానళ్ల ఏర్పాటుతో ప్రతీ పాఠశాలలో రెండు కిలోవాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. కిలోవాట్కు రూ.లక్షచొప్పున ఖర్చవుతుంది. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్ ను గ్రిడ్ అనుసంధానిస్తారు. బ్యాటరీ ఇన్వర్టర్ ద్వారా నిలువ చేసుకుని అవసరం మేరకు వినియోగించుకోనున్నారు. ఈ నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం భరించనుంది. ఐదేళ్ల పాటు సంస్థతో నిర్వహణ ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో ఇందుకు సంబంధించిన టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు.

విద్యార్థులకు ప్రయోజనం..

సోలార్ ప్యానళ్ల ఏర్పాటుతో పాఠశాలల్లో ఇక విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదు. వీటి ఏర్పాటుతో ప్రభుత్వానికి కూడా విద్యుత్ భారం తగ్గనుంది. మిగులు విద్యుత్ గ్రిడ్ కు విక్రయించడం ద్వారా ఆయా పాఠశాలల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. వీటిని బడుల అభివృద్ధికి వినియోగించవచ్చు.

ఉన్నతాధికారుల నుండి గైడ్లైన్స్ రాలేదు..

ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానళ్ళ ఏర్పాటు విషయంలో ఇంకా ఆదేశాలు రాలేదు. ఉన్నతాధికారుల నుండి ఎలాంటి గైడ్లైన్స్ అందలేదు. ఆదేశాలు వస్తే చర్యలు తీసుకుంటాం. గతంలో సీఎస్‌ఆర్ ద్వారా జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో సోలార్ ప్యానెళ్ళు ఏర్పాటు చేశారు.

- వేంకటేశ్వర్లు, డీఈవో సంగారెడ్డి