calender_icon.png 12 November, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

12-11-2025 12:00:00 AM

కలెక్టర్ ప్రావీణ్య

పుల్కల్ (సంగారెడ్డి), నవంబర్ 11 : ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియనువేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. మండల కేంద్రమైన పుల్కల్‌లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం వివరాలు ఇప్పటివరకు తూకం వేసి మిల్లులకు పంపిన ధాన్యం వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.  మండలంలోని హార్వెస్టర్ యజమానులతో సమావేశం నిర్వహించి ఆర్పిఎం ఎక్కువగా ఉంచి హార్వెస్టర్లు నడిపేలా అవగాహన కల్పించాలని తాసిల్దార్ కు సూచించారు. అనంతరం గ్రామ శివారులోని కోదండ రామా ఇండస్ట్రీస్‌లో ఏర్పాటు చేసిన  సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. రైతులకు నూతన పత్తి కొనుగోలు విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు కిసాన్ కంపాస్ యాప్ స్లాట్ బుక్ చేసుకొని అందులో సూచించిన విధంగా నిర్ణీత సమయానికి సీసీఐ కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకురావాలని సూచించారు.

పదిలో శతశాతం సాధించాలి..

పుల్కల్ మండల పర్యటనలో భాగంగా సింగూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పరీక్షలంటే ఉండే భయాన్ని తొలగించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు.

అనంతరం గొంగ్లూర్ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిర ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆందోల్ ఆర్డీవో పాండు, సంబంధిత శాఖల అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.