4 September, 2026 | 6:06 AM

బోధన్‌లో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ

04-09-2026 | 04:50am

బోధన్, సెప్టెంబర్ 3 (విజయ క్రాంతి):బోధన్ పట్టణంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య,(Nizamabad Police Commissioner P. Sai Chaitanya) ఐపీఎస్ గురువారం పరిశీలించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మీర్ ఇల్యాస్ అలీ విజ్ఞప్తి మేరకు సీపీ ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలు, వాహనాల రాకపోకలు, రహదారి భద్రతకు సంబంధించిన అంశాలను సీపీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను గుర్తించి, వాహనదారులు మరియు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా రోడ్డు అండ్ బిల్డింగ్స్ (ఆర్‌అండ్బీ) అధికారులతో సీపీ మాట్లాడి జాతీయ రహదారిపై అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, రోడ్డు భద్రతా సూచికలు, ఇతర రక్షణ చర్యలు చేపట్టే అంశంపై చర్చించారు. ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇటీవల జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడం పట్ల సీపీ సాయి చైతన్య సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రమాద స్థల పరిశీలన సందర్భంగా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు పలు సమస్యలను సీపీ దృష్టికి తీసుకువచ్చారు. రహదారి భద్రతకు సంబంధించి వచ్చిన సూచనలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని సీపీ హామీ ఇచ్చారు.