ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
హైదరాబాద్: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూలగోట్టిన ప్రాంతాన్ని సీసీఐ నేత నారాయణ పరిశీలించారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను నారాయణ సమర్థించారు. పేదల గజం స్థలం ఆక్రమిస్తేనే నానా రాద్ధాంతం చేస్తారు. నాగార్జున తుమ్మిడి చెరువును ఆక్రమించారు. ఎన్ కన్వెన్షన్ మీద రోజుకు రూ. లక్ష ఆదాయం వస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని నారాయణ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి బుస కొట్టింది.. తర్వాత సైలెంట్ అయ్యిందని ఆరోపించారు. అక్రమ కట్టడాలను సీఎం రేవంత్ కూల్చేయించడం మంచిదే అన్నారు. నాగార్జున మంచి నటుడు కావొచ్చు.. కానీ కక్కుర్తి ఎందుకు.? సినిమా డైలాగ్‌లు కొట్టడం కాదు.. బుకాయింపు మాటలు వద్ద అని నారాయణ పేర్కొన్నారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువులో కాలేజీలు కట్టారు. వారంతా కబ్జా కోరులు, ఫిరంగి నాలాను కబ్జా చేశారని నారాయణ పేర్కొన్నారు. చెరువులను, నాలాలు కబ్జా చేసి ఇళ్లు కట్టుకున్నారు. చెరువులు, నాలాలు కబ్జా అయితే ఊర్లు మునిగిపోతాయని నారాయణ సూచించారు. ఆరంభ శూరత్వం కాదు.. ఎక్కడ కబ్జా జరిగినా కూలగొట్టాలని నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు తొలగిస్తే నీటిమట్టం పెరుగుతోందన్నారు.
మధ్య తరగతి పేదవారికి ప్రత్యామ్నాయం చూపాలని ఆయన పేర్కొన్నారు. పెద్దలు కబ్జాలు చేసినా, దొంగ పట్టాలు పొందినా స్వాధీనం చేసుకోవాలన్నారు. రాజకీయ కక్షసాధింపు లేకుండా నిష్పక్షపాతంగా ఉండాలన్నారు. ఒకే పార్టీ, ఒకే వర్గం మీద కక్ష సాధింపు మంచిది కాదు అని నారాయణ సూచించారు. ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగాలి, ఎంఐఎం వారివి కూడా తొలగించాలని నారాయణ డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.






