ఇప్పటివరకు కూల్చివేసిన నిర్మాణాలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక
హైదరాబాద్: ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో కూల్చివేసిన నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన హైడ్రా 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చినట్లు హైడ్రా నివేదిక ప్రకటించింది. ప్రొ కబడ్డీ యజమాని అనుపమకు చెందిన భవనం, కావేరి సీడ్స్ యజమాని భాస్కరరావుకు చెందిన నిర్మాణం, మంథని బీజేపీ నేత సునీల్ రెడ్డి నిర్మాణాన్ని కూల్చివేసినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది.
ఎంఐఎం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆక్రమించిన 12 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ కు చెందిన ఐదంతస్తుల భవన నిర్మాణం నేలమట్టం చేసినట్లు హైడ్రా వెల్లడించింది. ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా భవనాన్ని, నందగిరి హిల్స్ లో ఎమ్మెల్యే దానం మద్దతుదారుడి నిర్మాణం కూల్చివేసింది. చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరావు షెడ్డు కూల్చినట్టు నివేదిక అందించింది. కాంగ్రెస్ నేత పళ్లంరాజు సోదరుడి నిర్మాణాన్ని కూల్చివేసినట్లు హైడ్రా చెప్పింది.






