25 May, 2026 | 6:30 PM

రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తాం

25-05-2026 05:56 PM

హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధరలు ప్రకటించడమే తప్ప రాష్ట్రంలో పంటను కొనుగోలు చేయడం లేదని, కనీసం 30 శాతం కూడా సేకరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పెండింగ్ ఉన్న కార్మికుల కనీస వేతనాల పెంపు నిర్ణయంపై ఈ సందర్భంగా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపింది.

ఈ సందర్భంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తున్నామని, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా హామాలీలు వెళ్లడంతో ఇక్కడ కొంత కొరత ఏర్పడిందన్నారు. అలాగే, ఎండల కారణంగా మధ్యాహ్నం సమయంలో పని జరగడం లేదని, ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం సమీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని, మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

మూసీ నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్థానికంగానే నివాసాలు మంజూరు చేస్తామన్నారు. ఈ విషయంలో పార్టీలు రాజకీయం చేయడం తగదని, మూసీ పునరుజ్జీవం చేసి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. మూసీ కాలుష్యం నల్గొండ జిల్లా ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారిందని, అక్కడ ఎదురవుతున్న పరిస్థితులను వివరించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు వల్ల యువతకు ఉపాధి లభించడమే కాకుండా నగర ప్రజల జీవన విధానం మెరుగవుతుందని చెప్పారు. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తున్నామని, ఈ సందర్భంగా విద్యా రంగంలో చేపడుతున్న కార్యక్రమాలను వారికి తెలియజేశారు.

నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు ముందుకు సాగుతుందన్నారు. అందులో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్‌ ఫాస్ట్, భోజనం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ, ఆరుట్ల పాఠశాలను ఒకసారి సందర్శించాలని సీపీఎం నాయకులను కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పి. సుదర్శన్, జ్యోతి, నున్నా నాగేశ్వరరావు, మల్లు లక్ష్, సామినేని స్వరాజ్యం, ఎం. గోపాలరావుతో పాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.