6 July, 2026 | 10:08 PM

మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం

06-07-2026 09:19 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామపంచాయతీ అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం గ్రామ శాఖ నాయకులు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. గ్రామపంచాయతీకి నూతన కార్యాలయ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, గ్రామంలో సుమారు 70 విద్యుత్ స్తంభాల కొరత ఉండటంతో వాటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు. గ్రామంలో ఉన్న ఐదు అంగన్‌వాడీ కేంద్రాల్లో రెండు కేంద్రాలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవని, సర్వాయి కాలనీ, గుత్తికోయల గుంపులోని అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మించడంతో పాటు మిగిలిన మూడు కేంద్రాలకు ప్రహరీ గోడలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే గ్రామంలోని మిగిలిన సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని, మొండికుంట–మల్లెలమడుగు మధ్య ఉన్న వంతెనను హై లెవల్ బ్రిడ్జిగా నిర్మించాలని కోరారు. వర్షాకాలంలో ఈ వంతెనపై రాకపోకలు నిలిచిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం వల్ల మొండికుంట–రామచంద్రపురం–భద్రాచలం మార్గంలో రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు. మొదటి విడతలో మల్లెలమడుగు గ్రామానికి 50 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు సీపీఎం గ్రామ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, రెండో విడతలో గ్రామంలోని అర్హులైన పేదలకు అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని సీపీఎం నాయకులు ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు.