6 July, 2026 | 10:37 PM

గిరిజన దర్బార్ లో గిరిజనులు అందించిన ప్రతి విన్నపాన్ని సత్వరమే పరిష్కరించాలి

06-07-2026 09:38 PM

ఐటీడీఏ పీవో బి.రాహుల్

భద్రాచలం, (విజయక్రాంతి): ఆదివాసి గిరిజన గ్రామాలలోని గిరిజనుల వివిధ సమస్యలను సత్వరంగా, పారదర్శకంగా పరిష్కరించడమే ఐటీడీఏ లక్ష్యమని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. సోమవారం నాడు ఐటీడీఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్ కార్యక్రమంలో ఐటీడీఏ ఏజెన్సీ ఏరియా పరిధిలోని గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎస్డీసీ ఆనంద్ కుమార్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ చందన, ఆర్సిఓ గురుకులం అరుణకుమారి, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఎడిఎంహెచ్వో సైదులుతో కలిసి దరఖాస్తులను మరియు వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు.

ఏజెన్సీ ఏరియా పరిధిలోని గిరిజనుల సమస్యలతో పాటు తదితర శాఖలకు సంబంధించిన సమస్యలను గిరిజనులు పిఓ దృష్టికి తీసుకువచ్చారు. గిరిజనులు సమర్పించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖల యూనిట్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిష్కరించగల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మిగిలిన సమస్యలను నిర్దేశిత గడువులో పూర్తి చేసి గిరిజనులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.

ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ,గిరిజన దర్బార్ కార్యక్రమాన్ని గిరిజనుల సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా వినియోగించుకోవాలని తెలిపారు. గిరిజనుల విన్నపాలను కేవలం నమోదు చేయడం కాకుండా వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి ఫలితాలు సాధించేలా యూనిట్ అధికారులు పనిచేయాలని సూచించారు. యూనిట్ అధికారులు సమన్వయంతో పనిచేస్తే సమస్యల పరిష్కారం మరింత వేగవంతమవుతుందని, గిరిజనుల ఫిర్యాదుల విషయంలో జాప్యం, నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు  అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా యూనిట్ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు.