ప్రమాద బాధిత కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చేయూత
భద్రాచలం దేవస్థానం ఈవో దామోదర్‌రావు చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేత
భద్రాచలం,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ పెద్దలను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెండు కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించింది. కారు ప్రమాదంలో మృతి చెందిన మల్లెల సత్యసాయి (సన్నీ) భార్య స్వర్ణముఖి, టిప్పర్ ప్రమాదంలో మృతి చెందిన కాలర్ల వేణుగోపాల్ భార్య శ్రావణిలకు భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి దామోదర్‌రావు చేతుల మీదుగా రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
వసుధ ఫౌండేషన్ తరఫున సంస్థ బాధ్యులు శ్రీనివాసరాజు ఈ సహాయాన్ని అందిస్తూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం సంస్థ యొక్క సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ముందుకు సాగేందుకు ఈ చిన్న సహాయం కొంతైనా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో దామోదర్‌రావు మాట్లాడుతూ, సమాజంలో సేవా భావంతో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు అవసరమైన సమయంలో బాధిత కుటుంబాలకు చేయూత అందించడం అభినందనీయమని అన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆర్థిక సహాయం అందుకున్న స్వర్ణముఖి, శ్రావణి కుటుంబ సభ్యులు తమ క్లిష్ట సమయంలో అండగా నిలిచిన వసుధ ఫౌండేషన్, దేవస్థానం ఈవో దామోదర్‌రావుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ. రవీంద్రనాథ్, సీసీ శ్రీనివాస్ రెడ్డి, వసుధ ఫౌండేషన్ బాధ్యులు శ్రీనివాసరాజు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






