30 March, 2026 | 2:19 AM

‘మనసు నీదైన వేళ’ ఈ కవనం

30-03-2026 12:00 AM

ప్రస్తుత సమాజంలో ప్రేమకు సరైన అర్థం, నిర్వచనం కరువవుతున్నాయి. ప్రేమ గొప్పదని, దానితో దేనినైనా జయించవచ్చని నిరూపించడానికి చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనిషి సన్మార్గంలో జీవించడానికి స్వచ్ఛమైన ప్రేమ అవసరమని కవయిత్రి కందాళ పద్మావతి అభిప్రాయపడుతున్నారు. ఆమె తాజా కవితా సంకలనం ‘మనసు నీదైన వేళ’. ఆమె కవితల్లో ప్రధానంగా ‘ప్రేమ అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల ఇష్టమే కాదు. అది పారే సెలయేరులా నిరంతరం ప్రవహిస్తుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు ఇలా ఎవరి ప్రేమ అయినా బాధ్యతను పెంచుతుంది.

ఆ బాధ్యత ఒక దృఢమైన బంధంగా మారి, సూర్యకాంతిలా మనల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది’ వంటి ఉదాత్తమైన భావాలను తన కవితల ద్వారా పాఠకుల ముందుకు తీసుకువచ్చారు. తన తొలి కవిత ‘మౌనం భాష’లో ప్రేమికులు పడే తపనను అద్భుతంగా ఆవిష్కరించారు. ‘నాలో చైతన్యాన్ని నింపుతున్న ప్రణయమా.. నేను వేరుగా లేక నీలోనే చేరిపోతున్నాను’ అంటూ తన భావాలను వ్యక్తం చేశారు. ‘ఓయ్’ కవితలో సన్నిహితమైన పిలుపులోని ఆత్మీయతను తెలియజేశారు. తన మనసు అనే తెల్ల కాగితంపై ప్రేమ అనే అక్షరం రాసింది ప్రియుడేనని పేర్కొన్నారు. 

సులువైన భావాల విశ్లేషణ

‘మరుజన్మకు వస్తా మనసుపడి’ అంటూ ఆ బంధం శాశ్వతమంటూ కవయిత్రి చాటుతారు. ‘వాకిట వేసిన రంగవల్లికను నేను.. సింగిడి రంగుల సిరిని.. కోటి దీపోత్సవాన్ని’ అంటూ తనలోని ఉత్సాహాన్ని కవిత్వీకరించారు. ప్రకృతి, దైవం తనను ప్రియుని దరికి చేర్చాయని విశ్వసించారు. ‘నీ వల్లే కదా.. నాలో ఈ కవితావేశం.. నీ కొరకే కదా ఈ అక్షర సుమార్చన’ అంటూ తన సృజనకు ప్రేమే మూలమని వెల్లడించారు.

‘నా కావ్య ప్రపంచానికి కమ్మని కవనాల కూర్పుకు ప్రేరణ నువ్వే కదా..’ అంటూ కొనియాడారు. శూన్యంలో జీవన కాంతి రేఖలు నింపాలని కవయిత్రి ఆకాంక్షించారు. ‘వెర్రి ఆశ’ కవితలో ప్రియుడు లేక కాలం ముందుకు కదలడం లేదని వేదనతో వివరించారు. వెలుగు చీకటి, సంతోషం, బాధలలో కూడా తోడుండాలని కోరుకున్నారు. ప్రేమ అంటే బంధించడం కాదు, స్వేచ్ఛను ఇవ్వడమని ఆమె ఒక గొప్ప సూత్రాన్ని చెప్పారు.

‘నీ ప్రేమె నా ఆయువై’ అంటూ ఆత్మీయతను చాటారు. మనసును అర్థం చేసుకుంటే ప్రకృతిలా, సముద్రంలా సంతోషంగా ప్రయాణించవచ్చని సూచించారు. ‘అనురాగ గీతం’ కవితలో తన గెలుపుకు మార్గదర్శి తన నాథుడేనని కృతజ్ఞత ప్రకటించారు. ‘నీ తలపుల’ కవితలో అనంతమైన ప్రేమను వర్ణించడానికి భాష చాలదని అభిప్రాయపడ్డారు. ‘కనుపాపలు నీకై వేచెను’ అంటూ ప్రతి క్షణం మనసు పడే విరాహాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు.

ప్రకృతి సౌందర్య కల్పన

కవయిత్రి ప్రకృతిని ఆసరాగా చేసుకుని తన ప్రేమను పండించుకున్నారు. పక్షుల రాగాలను ప్రేమ గీతాలుగా భావించారు. ప్రతి వస్తువులోనూ ప్రియుడినే చూసుకున్నారు. ‘మనసు రోదిస్తుంది మౌనం వెనుక’ అంటూ తనలోని అంతర్మథనాన్ని ‘ప్రశ్నా పత్రం’ కవితలో బయటపెట్టారు. మనసులో నిండిన భావాలు ఉత్తరాల ద్వారా కవితలుగా రూపాంతరం చెందాయని తెలిపారు. ‘ప్రేమామృతం’ కవితలో అలకలు, బుజ్జగింపుల ద్వారా కలిగే ఆనందాన్ని వివరించారు. ‘నేను నీ సొంతమై.. నీవు నా బంధమై’ అంటూ స్వర్గ తీరం వైపు సాగే ప్రయాణాన్ని వర్ణించారు.

‘నీ హృదయ సామ్రాజ్ఞిని’ అంటూ తన స్థానాన్ని గర్వంగా చాటారు. దూరంగా ఉన్నప్పుడు ప్రేమికులు పడే తపనను ‘మృదు మధుర భావనలెన్నో నా ఎద మెదలుతుండెను నిలువనీయక!’ అంటూ రాధాకృష్ణుల బంధంతో పోల్చారు. ‘మరల మరల చదువుకో ప్రియా.. నా జీవన పుస్తకంపై నీ సంతకపు ఆనవాళ్ళని’ అంటూ రాసిన వాక్యాలు ఆమె కవిత్వ పరిణతిని చూపుతాయి. ప్రేమను ఒక నిధిలా భావిస్తూ ఎన్నో భావాలను దాచుకున్నానని పేర్కొన్నారు.

‘అనురాగ పరిష్వంగం’లో ప్రేమ మాధుర్యాన్ని గంధపు లేపనంతో, మణుల తాపడంతో, మంజీర నాదంతో పోల్చి దాని గొప్పతనాన్ని వివరించారు. చివరి కవితలో వృద్ధాప్యంలో సైతం తోడుండాలని కోరుకున్నారు. ‘నీ కళ్ళు ప్రతి క్షణం నాకై వెతికితే’ అంటూ ప్రాణాలు కూడా ఒక్కటైపోవాలని ఆకాంక్షించారు. పుస్తకంలోని ప్రతి కవితలో తేనెపట్టు, చిరుజల్లులు, మంచు వెన్నెల, లేగ దూడల గెంతులు.. వంటి చిన్న చిన్న అందాలు, ఆనందాలను ప్రతిబింబిస్తాయి. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ప్రేమకు సరికొత్త భాష్యం చెబుతుంది తన కలం.. అని కవయిత్రి ఈ కవతా సంపుటి ద్వారా నిరూపించారు.

 సమీక్షకుడు కవి, సెల్: 97012 09355