కుప్పకూలిన విమానం
మలావీ ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం
లిలోంగ్వే (మలావీ), జూన్ 11: ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు 9 మంది అధికారుల ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. విమానం కోసం మాలావీ సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. చివరకు విమాన శకలాలు గుర్తించారు. అందులో ఎవరూ ప్రాణాలతో లేరని ఆ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా వెల్లడించారు.
మలావీ ఉపాధ్యక్షుడు, మరో తొమ్మిది మంది ప్రయాణిస్తున్న విమానం సోమవారం అదృశ్యమైంది. రాజధాని లిలోంగ్వే నుంచి బయల్దేరిన ఆ విమానం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానా శ్రయంలో దిగాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగొద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది. ఈ క్రమంలో తిరిగి వెళ్తుండగా రాడార్‌తో విమానం సంబంధాలు తెగిపోయాయి. విమానం కోసం వందల మంది సైనికులు, పోలీసులు ముమ్మరంగా గాలించారు. చివరకు పర్వత ప్రాంతాల్లో కూలిపోయినట్టు గుర్తించారు.






