ఉచిత ఆరోగ్య శిబిరంతో ప్రజలకు ఆరోగ్య అవగాహన
కోనరావుపేట,(విజయక్రాంతి): జై సేవాలాల్ భూక్యారెడ్డి తండా గ్రామపంచాయతీ పరిధిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆరోగ్య శిబిరం, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్)పై అవగాహన కల్పించారు.మెడికల్ ఆఫీసర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ... రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో ముఖ్యమన్నారు. ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవాలని, తగినంత వ్యాయామం చేయాలని సూచించారు.
ఉప్పు, అధిక చక్కెర వినియోగాన్ని తగ్గించాలని తెలిపారు.శిబిరంలో ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఆరోగ్య సూచనలు అందించారు. సర్పంచ్ బానోత్ నరేష్ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి ఆరోగ్య శిబిరాల ద్వారా వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయని అన్నారు.ప్రజలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సురేష్ కుమార్, హెల్త్ సూపర్వైజర్ రషీద్, హెల్త్ అసిస్టెంట్ సవాయి నాయక్, ఏఎన్‌ఎం జ్యోతి, ఆశా వర్కర్ రాజిత, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






