28 May, 2026 | 1:54 AM

జిల్లాల్లో క్రికెట్‌కు హెచ్‌సీఏ చేసిందేంటి ?

28-05-2026 12:14 AM

నిలదీసిన టీసీఏ క్రికెటర్లు, కోచ్‌లు

హెచ్‌సీఏ హైదరాబాద్‌కే పరిమితమైంది

టీజీ20 లీగ్‌ను రద్దు చేయాలని డిమాండ్

హైదరాబాద్, మే 27: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ క్రికెటర్లు, కోచ్‌లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. జిల్లాల్లో క్రికెట్‌కు టీసీఏ మాత్రమే రాజ్యాంగబద్దమైన ప్రాతినిధ్య సంస్థగా పేర్కొన్నారు. 22 వేల మందికి పైగా టీసీఏలో నమోదిత క్రికెటర్లు ఉన్నారనీ, యువ ఆటగాళ్ల ప్రతిభను గుర్తిస్తున్నది కూడా టీసీఏ మాత్రమేనని స్పష్టం చేశారు.

టీసీఏ 75కు పైగా టోర్నమెంట్లు నిర్వహించి సమాన అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. హె చ్‌సీఏ కేవలం హైదరాబాద్‌కే పరిమితమైందనీ, జిల్లాల్లో సరైన మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయిందని విమర్శించారు. బీసీసీఐ నుంచి వందల కోట్ల నిధులు పొం దుతున్న హెచ్‌సీఏ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. గత 20 ఏళ్ళలో తెలంగాణ జిల్లాల నుంచి ఎంతమంది ప్లేయర్స్ రంజీ ట్రోఫీలో హైదరాబా ద్‌కు ప్రాతినిథ్యం వహించారో చెప్పాలన్నారు.

అలాగే బీసీసీఐ నిధుల్లో జిల్లాల్లో మౌలి క సదుపాయాలు, కోచింగ్ సెంటర్లు, అకాడమీల కోసం ఎంత ఖర్చు చేశారనీ ప్రశ్నించారు. టీసీఏ గ్రామీణ ప్రాంతాల్లో నెట్స్ ఏర్పా టు చేసి వ్యవస్థను అభివృద్ధి చేస్తుంటే హెచ్‌సీఏ ఫ్రాంచైజీ బిడ్డింగ్, వాణిజ్య ఒప్పందా లతో ఎక్కువ బిజీగా ఉందని విమర్శించారు. జిల్లాల్లో క్రికెట్ ప్రతిభను గుర్తించే బాధ్యతను అసలు హెచ్‌సీఏ ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. హెచ్‌సీఏ కేవలం ఓటు బ్యాంక్ రాజ కీయాలపైనే దృష్టి పెట్టిందని టీసీఏ కోచ్‌లు మండిపడుతున్నారు.

ఎలాంటి అనుమతులు లేకుండా టీజీ20 లీగ్ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. బీసీసీఐ అనుమతి పత్రం చూపించడం లేదనీ, లీగ్ నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఓపెన్ సెలక్షన్స్ హైదరాబాద్‌లో నిర్వహించిన హెచ్‌సీఏ, టీజీ20 లీగ్‌కు రిజిస్టర్డ్ క్రికెటర్లకు మాత్రమే పరిమితం చేయడాన్ని తప్పుపట్టారు. లీగ్‌కు రాజ్యాంగబద్దమైన అనుమ తులు లేవనీ, తక్షణమే దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

హెచ్‌సీఏలో పే అం డ్ ప్లే సంస్కృతికి ముగింపు పలకాలన్నారు. గత 12 ఏళ్లు తెలంగాణా జిల్లాల్లో టోర్నమెంట్లు, కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తూ యువ ఆటగాళ్లకు టీసీఏ అండగా నిలుస్తోందన్నా రు. ఒక రాష్ట్రంలో రెండు క్రికెట్ అసోసియేషన్లు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. మహా రాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఒకటి కంటే ఎక్కువ అసోసియేషన్లు ఉన్నాయన్నారు. తెలంగాణ జిల్లాల్లో క్రికెటర్లకు న్యాయం జరగాలంటే టీసీఏకు వెంటనే గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.