30 August, 2026 | 12:42 PM

ప్రజల వద్దకే పాలన.. సమస్యల పరిష్కారమే లక్ష్యం

30-08-2026 11:34 AM

ఐనోల్‌లో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మార్నింగ్ వాక్

అచ్చంపేట: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా అచ్చంపేట ఎమ్మెల్యే(Achampet MLA) డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చేపడుతున్న మార్నింగ్ వాక్‌లో భాగంగా శనివారం ఐనోల్ గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో నడుస్తూ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వినతులను స్వీకరించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఐనోల్‌లోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, భోజనం, వసతులు, మౌలిక సౌకర్యాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి మండలం, గ్రామంలో మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను వారికి వివరించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.