28 May, 2026 | 1:54 AM

చరిత్ర సృష్టించిన ఈషా సింగ్

28-05-2026 12:17 AM

వరల్డ్‌కప్‌లో ప్రపంచ రికార్డు

స్వర్ణం గెలిచిన హైదరాబాదీ

మ్యూనిచ్, మే 27: భారత షూటింగ్ సంచలనం ఈషా సింగ్ చరిత్ర సృష్టించింది. మ్యూనిచ్ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది. జర్మనీ, బల్గేరియా, చైనా వంటి అగ్రశ్రేణి షూటర్లను నిలువరిస్తూ అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. 21 ఏళ్ల ఈషా సింగ్ ఫైనల్స్‌లో 43 పాయింట్లు సాధించి సరికొత్త వరల్ రికార్డు నెలకొల్పింది.

తద్వారా గతంలో నెలకొల్పిన 42 పాయింట్ల రికార్డును బ్రేక్ చేసింది. అలాగే జూనియర్ స్థాయిలో సైతం ఇదే అత్యుత్తమ రికార్డుగా నమోదైంది. తుదిపోరులో ఎంతో ఒత్తిడిని తట్టుకుని ఆమె ఈ విజయాన్ని అందుకుంది. ఈ మెగా ఈ వెంట్‌లో 85 దేశాలకు చెందిన 723 మంది అథ్లెట్లు పాల్గొంటుండగా హైదరాబాదీ షూటర్ ఈషా సింగ్ అద్భుతమైన ప్రదర్శనతో స్వర్ణం గెలిచి భారత సత్తా చాటింది. ఫైనల్స్ లో ఈషా సింగ్ 43 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. జర్మనీకి చెంది డోరీన్ వెన్నె క్యాంప్ 38 పాయింట్లతో రజతాన్ని, బల్గేరియా షూటర్ మిరోస్లావా మించెవా 31 పాయింట్లతో కాంస్యాన్ని గెలుచుకున్నారు.

వరల్డ్ రికార్డుతో స్వర్ణం గెలిచిన ఈషా సింగ్ ను భారత షూటింగ్ ప్రముఖులు అభినందిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఈషా సింగ్ కేవలం 13 సంవత్సరాల వయస్సు నుంచే షూటింగ్‌లో చారిత్రక విజయాలను సాధిస్తూ తనదైన ముద్ర వేసింది. చైనాలో జరిగిన ఆసియా క్రీడలలో స్వర్ణం, 3 రజత పతకాలు కైవసం చేసుకుంది. వరల్డ్ షూటిం గ్ ఛాంపియన్‌షిప్, ఆసియా సీనియర్ షూ టింగ్ ఛాంపియన్‌షిప్, ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ పోటీలలో పతకాలు సాధించింది.