9 May, 2026 | 3:40 AM

ముందు జాగ్రత్తలతోనే నేరాల నివారణ సాధ్యం

09-05-2026 12:00 AM

- దొంగతనాలను ఆపేందుకు ప్రత్యేక దృష్టి

- బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్

బెల్లంపల్లి, మే 8: ముందస్తు జాగ్రత్తలతోనే నేరాల నివారణ సాధ్యమవుతుందని, క్రైం రేట్ తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ ముందుకు సాగుతుందని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం మందమర్రి ఇల్లందు క్లబ్లో బ్యాంకులు, ప్రైవేట్ గోల్ ఫైనాన్స్ సంస్థలు, గోల్ షాపులు, లాడ్జిల మేనేజర్లు, యజమానులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏసీపీ మాట్లాడారు.

దొంగతనాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామని, బంగారు ఆభరణాల వ్యాపారులు, గోల్ లోన్ సంస్థల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలతో ఉన్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులకు లాడ్జిల్లో గదులు కేటాయించే సమయంలో తప్పని సరిగా వారి ఆధార్ కార్డుతో అనుసంధానమైన ఫోన్ నంబర్లను పరిశీలించిన అనంతరమే గదులు ఇవ్వాలని సూచించారు.

వరుస దొంగతనాలు జరుగుతున్నాయని, దొంగలు బంగారాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని, బ్యాంకులు, ప్రైవేట్ గోల్ లోన్ సంస్థలు, ఆభరణాల వ్యాపారులు తమ భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలన్నారు. తప్పకుండా ఫైర్ సైరన్లను ఏర్పాటు చేసుకోవాలని, గన్ లైసెన్స్ కలిగిన వ్యక్తులను భద్రతా సిబ్బందిగా నియమించుకుంటే పూర్తి స్థాయి భద్రత కల్పించవచ్చన్నారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేర సంఘటనలు జరిగిన తర్వాత ఫిర్యాదు చేయడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రాంతాన్ని నేరరహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్, బెల్లంపల్లి వన్టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు, మందమర్రి సీఐ పర్స రమేష్, బెల్లంపల్లి ఎస్‌ఐలు, బ్యాంకు మేనేజర్లు, గోల్ షాప్ యజమానులు, లాడ్జ్ మేనేజర్లు పాల్గొన్నారు.