12 April, 2026 | 3:57 PM

సిద్ధుపై నేర విచారణ

18-08-2024 12:56 AM

చిక్కుల్లో కర్ణాటక ముఖ్యమంత్రి

మెడకు చుట్టుకున్న ముడా కేసు

విచారణకు రాష్ట్ర గవర్నర్ అనుమతి

గవర్నర్ చర్య రాజ్యంగ విరుద్ధం

సిద్ధరామయ్య ఆగ్రహం

బెంగళూరు, ఆగస్టు 17: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో ముఖ్యమంత్రిని విచారించేందుకు రాస్టర గవర్నర్ తావర్‌చంద్ గెహ్లోట్ శనివారం అనుమతి ఇచ్చారు. మైసూ రు మున్సిపాలిటీలో సిద్ధరామయ్య తన భార్యకు నిబంధనలకు విరుద్ధంగా భూమి కేటాయించారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంలో సీఎంపై విచారణకు ఆదేశించాలని ప్రజావేగులు ప్రదీప్‌కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణన్ రాష్ట్ర గవర్నర్‌కు లేఖలు రాశారు.

ఈ లేఖలపై స్పందించిన గవర్నర్ విచారణకు ఆదేస్తున్నట్టు వారికి ప్రత్యుత్తరం పంపారు. ‘పిటిషన్లలో ప్రస్తావించిన అంశాలపై అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17, భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 218 ప్రకారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై నిర్ణీత సంస్థతో దర్యాప్తు జరిపించాలని గవర్నర్ ఆదేశాలు జారీచేశారు. అందుకు సంబంధించిన ఆదేశాల ప్రతులను మీకు పంపుతున్నాం’ అని ఫిర్యాదుదారులకు గవర్నర్ కార్యాలయం పంపిన లేఖలో పేర్కొన్నారు. నేర విచారణపై తమకు కూడా సమాచారం అందిందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. 

కేంద్రం కుట్రలో భాగమే

తనపై నేరవిచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వటంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధమని విరుచుకుపడ్డారు. సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా తనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. మరోవైపు సిద్ధరామయ్య సీఎం సీటు కోసం కాచుకు కూర్చున్న డిఫ్యూటీ సీఎం డీకే శివకుమర్ కూడా సీఎంకు మద్దతుగా నిలిచారు.

‘గవర్నర్ తన కార్యదర్శి ద్వారా రాజ్యాంగ విరుద్ధమైన లేఖ పంపారు. కర్ణాటక రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్యకు అండగా నిలుస్తుంది. ఆయన మా సీఎం. ఆయనే సీఎంగా ఉంటారు. ఎలాంటి కేసును అవకాశం లేనిచోట వివాదం సృష్టిస్తున్నారు. గవర్నర్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తాం’ అని డీకే శివకుమార్ తెలిపారు. జేడీఎస్, బీజేపీ నేతలపై ఎప్పటి నుంచో పెండిగ్‌లో ఉన్న కేసులను పట్టించుకోని గవర్నర్.. ఎలాంటి కేసులేని అంశంపై విచారణకు ఆదేశించటం రాజకీయ కుట్రలో భాగమేనని కర్ణాటక కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది.

‘మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామితోపాటు మాజీ మంత్రులు శశికళ జొల్లీ, మురుగేశ్ నళినిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చినా విచారణను గవర్నర్ ఆలస్యం చేస్తున్నారు. కానీ, ఎలాంటి ఆధారాలు లేకుండా వచ్చిన ఓ ప్రైవేటు ఫిర్యాదును పట్టుకొని ఆగమేఘాల మీద సీఎంపై విచారణకు ఆదేశించారు. ఇది కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమైన కుట్ర’ అని ఆరోపించింది. గవర్నర్ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది.  

అసలేంటీ కుంభకోణం?

మైసూరు నగరపాలక సంస్థ విస్తరణకోసం ప్రభుత్వం చుట్టుపక్కల గ్రామాల భూములను నోటిఫై చేసింది. అందులో కేరసు గ్రామంలో సిద్ధరామయ్య సతీమణి పార్వతికి చెందిన 3.16 ఎకరాల భూమి కూడా ఉన్నది. ఈ భూమికి బదులుగా ఆమెకు 2022లో విజయనగరలో 50:50 పరిహారం ప్రకారం అత్యంత విలువైన 14 ప్లాట్లు కేటాయించారు. ఇక్కడే వివాదం మొదలైంది. పార్వతి నుంచి సేకరించిన 3.16 ఎకరాల భూమికంటే అందుకు బదులుగా ఆమెకు కేటాయించిన 14 ప్లాట్ల విలువ చాలా ఎక్కువవని అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముడా భూముల కేటాయింపులో సీఎంతోపాటు ఆయన సతీమణి, కుమారుడు యతీంద్ర, ముడా ఉన్నతాధికారులు కూడా పాత్రధారులేనని ఆరోపించారు. పార్వతికి 14 విలువైన ప్లాట్లు కేటాయించటంవల్ల ముడాకు రూ.45 కోట్ల నష్టం వచ్చిందని అబ్రహం తన ఫిర్యాదులో పేర్కొన్నారు.