పోలింగ్ లెక్కల్లో ఇంత తేడా ఏంది?
ఓటింగ్ ముగిసిన వెంటనే ఎందుకు లెక్కలిస్తలేరు?
ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాల విమర్శలు
న్యూఢిల్లీ, మే 23: లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం వెంటనే ప్రకటించకపోవటంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలను పెంచాయి. పోలింగ్ రోజు చెప్తున్న లెక్కలకు, కొద్దిరోజుల తర్వాత విడుదల చేస్తున్న లెక్కలకు భారీగా తేడా ఎందుకుం టున్నదని నిలదీస్తున్నాయి. సాధారణంగా పోలింగ్ ముగిసిన వెంటనే ఈసీ మీడియా సమావేశం నిర్వహించి నమోదైన పోలింగ్ శాతాన్ని వెల్లడించటం దశాబ్దాలుగా వస్తున్నది. ఈసారి ఈసీ ఆ సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. పోలింగ్ ముగిసిన వారం తర్వాత లెక్కలు ప్రకటిస్తున్నది. రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు పోలింగ్ శాతాలను వెల్లడిస్తున్నారు. ఆ లెక్కలను చూస్తే ఈసీ ప్రకటిస్తున్న తుది లెక్కలకు చాలా తేడా ఉంటుంది.
ఇదే అంశంపై కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున ఖర్గేతోపాటు ఆ పార్టీ నేతలు జైరాం రమేశ్, కపిల్ సిబల్ కూడా ఈసీపై విమర్శలు ఎక్కుపెట్టారు. పోలింగ్ రోజు చెప్తున్న లెక్కలకు, పది రోజుల తర్వాత చెప్తున్న లెక్కలను పోల్చి చూస్తే దాదాపు కోటికిపైగా ఓట్ల తేడా వచ్చిందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా బుధవారం తెలిపారు. ‘పోలింగ్ రోజు మీడియాలో వచ్చిన ఎన్నికల శాతం లెక్కలకు.. పది రోజుల తర్వాత ఈసీ వెల్లడించిన లెక్కలకు నాలుగు దశల పోలిం గ్ ముగిసే నాటిని 1.07 కోట్ల ఓట్ల తేడా వచ్చింది. బీజేపీ గెలుపు అవకాశాలు తక్కువ ఉన్న చోట్లనే ఈ తేడా కనిపిస్తున్నది. ఇప్పటికే పోలింగ్ పూర్తయిన స్థానాలకు పెరిగిన ఈ 1.07 కోట్ల ఓట్లను సమానంగా పంచితే ఒక్కో స్థానంలో రియల్‌టైం ఓటింగ్ శాతంతో పోల్చితే.. ఈసీ 28 వేల ఓట్లు ఎక్కువ చూపిస్తున్నది. అసలు ఏం జరుగు తోంది?’ అని జైరాం రమేశ్ ప్రశ్నించారు.






