1 August, 2026 | 8:39 PM

మోదీ హద్దు దాటారు

24-05-2024 01:37 AM

అనారోగ్యంతో ఉన్న నా తల్లిదండ్రులను వేధించకండి

వాళ్లు తప్పు చేశారని భావిస్తున్నారా?

మిమ్మల్ని దేవుడు ఎప్పటికీ క్షమించడు!

మలివాల్ కేసులో ప్రధానిపై కేజ్రీవాల్ మండిపాటు

న్యూఢిల్లీ, మే 23: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న తమ వృద్ధ తల్లిదండ్రులను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారని తెలిపారు. నేను ప్రధాని మోదీకి ఒకటే చెప్పాలనుకుంటున్నా. మీరు మా ఎమ్మెల్యేలను, మంత్రిని అరెస్ట్ చేశారు. చివరికి నన్ను కూడా జైలులో వేసి వేధించారు. కానీ ఈ రోజు మోదీ అన్ని హద్దులను అతిక్రమించారు. నన్ను సాధించేందుకు అనారో గ్యంతో ఉన్న నా తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుంటారా? నేను అరెస్టయిన రోజే మా అమ్మ ఆసుపత్రి నుంచి వచ్చారు. నా తండ్రికి 85 ఏళ్లు. ఆయనకు చెవులు సరిగ్గా వినబడటం లేదు. నా తల్లిదండ్రులు తప్పు చేశారని మీరు భావిస్తున్నారా? వాళ్లను ఎందుకు వేధిస్తున్నారు? దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు అని మండిపడ్డారు. 

ఇప్పుడే కాదు

గురువారం ఉదయం సివిల్ లైన్స్‌లోని సీఎం అధికారిక నివాసానికి పోలీసులు రానున్నట్లు తనకు చెప్పినట్లు కేజ్రీవాల్ తెలిపారు. తన తల్లిదండ్రులతో పాటు భార్య సునీత నుంచి కూడా వాంగ్మూలం తీసుకుంటామని పేర్కొన్నారని చెప్పారు. ఈ విష యంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదని వెల్లడించారు. అయితే, సీఎం తల్లిదండ్రులను గురువారం ప్రశ్నించబోమని పోలీసు లు చెప్పినట్లు సమాచారం. కాగా, స్వాతి మలివాల్‌పై దాడి ఘటన విషయంలో కేజ్రీవాల్ బుధవారం తొలిసారిగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని కోరుకుంటున్నా. ఈ కేసులో రెండు కోణాలు ఉన్నాయి. రెండు వైపులా నిష్పక్షపాతంగా విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందుతుంది. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటం వల్లనే నేను ఏమీ మాట్లాడట్లేదు అని వివరించారు. 

సీసీటీవీ దృశ్యాల పరిశీలన

ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి వ్యవహారం ఢిల్లీతో పాటు దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన పోలీసులు బిభవ్‌ను అరెస్టు చేయగా దర్యాప్తును ముమ్మరం చేశారు. సీఎం నివాసంలోనే దాడి జరిగినట్లు ఎంపీ ఫిర్యాదు నేపథ్యంలో అక్కడి సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదే విషయంలో అక్కడే ఉంటున్న కేజ్రీవాల్ తల్లిదండ్రులతో పాటు భార్య సునీతను ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.