వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ అవగాహన కల్పించాలి
క్రాప్ బుకింగ్ తప్పుడు లెక్కలు ఉంటే ప్రణాళికలు తప్పుతాయి-జిల్లా కలె క్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): క్షేత్ర స్థాయిలో పర్యటించి క్రాప్ బుకింగ్ చేయని పక్షంలో ఎరువుల సరఫరా, పంట కొనుగోలు తదితర సూక్ష్మ ప్రణాళికలు తప్పుతాయని, అందువల్ల తప్పులకు అవకాశం ఇవ్వొద్దని కలె క్టర్ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన క్రాప్ బుకింగ్, రుణ మాఫీ కానీ రైతుల ఫ్యామిలీ గ్రూపింగ్, ఎరువుల వాడకం, అధిక వర్షాల వల్ల పంట నష్టం అంచనాపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ విస్తిర్ణాధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లకుండా ఇంటిదగ్గర కూర్చొని క్రాప్ బుకింగ్ నమోదు చేస్తున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఇప్పటి వరకు లక్ష్యం మేరకు క్రాప్ బుకింగ్ చేయని ఏఈఒలను కారణాలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయ రుణ మాఫీ కానీ రైతుల ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని కలక్టర్ మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మిగిలిపోయిన రైతుల వివరాలు తీసుకొని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 11 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయని తెలిపారు. రైతులు మోతాదుకు మించి యూరియా వాడకం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని, ఎరువుల వాడకం పై ప్రతి మంగళవారం రైతు వేదికల్లో అవగాహన కల్పించాలని సూచించారు. చీడ పురుగులు నివారణ, మందుల వాడకం పై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
జొన్న రైతులు కంకులు రోడ్ల పై వేస్తున్నారని అది చాల ప్రమాదకరమని, రోడ్డు ప్రమాదాలను అన్నారు. వ్యవసాయ విస్తిర్నాధికారులు రైతులకు ఈ విషయం పై అవగాహన కల్పించాలని సూచించారు.పంట నష్టం అంచనాల పై నిబంధనలు పాటించాలని కలక్టర్ సూచించారు. వర్షాల వల్ల 33 శాతానికి పైగా నష్టం జరిగితే పంట నఫ్టం కింద పరిగణించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి సలహాలు సూచనలు చేస్తూ ఉండాలని సూచించారు.జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, ఏ.డి. ఏ కొత్తకోట దామోదర్, ఏ. డి. ఏ శివనాగి రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్టర్నాధికారులు పాల్గొన్నారు.