30 August, 2026 | 2:52 AM

వానకాలం సీజన్‌లో పంట బీమా

10-06-2024 01:45 AM

గైడ్‌లైన్స్ సిద్ధం చేస్తోన్న వ్యవసాయశాఖ 

ప్రీమియం చెల్లించేది ప్రభుత్వమే

వాతావరణ పరిస్థితులకు తగిన విధంగా ప్లాన్

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో పంట బీమా పథకం అమలుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఈ వానకాలం సీజన్ నుంచే అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో గైడ్‌లైన్స్ సిద్ధం చేస్తోంది.  రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని వివిధ రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని పంట బీమా అమలు చేయనున్నారు. వానకాలం సీజన్‌లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగుచేస్తారని అంచనా వేసిన వ్యవసాయశాఖ ప్రకృతి విపత్తులతో పంటలకు నష్టం జరిగితే రైతులకు పరిహారం అందేలా ఏర్పాట్లు చేస్తుంది.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫసల్ బీమా పథకం నిలిపివేసింది. దీంతో గత ఐదేండ్లగా పంటలు నష్టపోయిన రైతులు పరిహారం అందక అనేక ఇబ్బందుల ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తిరిగి పంట బీమాను అమలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. యాసంగి పంట నష్టపోయిన 10 జిల్లాలో రైతులకు రూ.15 కోట్లు విడుదల చేసింది. అప్పటినుంచి ప్రభుత్వం బీమా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రైతులు చెల్లించే బీమా ప్రీమియం వాటాను కూడా ప్రభుత్వమే చెల్లించడానికి ముందుకు వచ్చింది. దీంతో రైతులకు పైసా ఖర్చు లేకుండానే ఉచితంగా పంటల బీమా అందుబాటులోకి రానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతో పాటు రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను  సర్కార్ భరించనుంది. 

వాతావరణ ఆధారితంగా బీమా పథకం అమలు 

అకాల వర్షాలతో నష్టం జరిగితే ఒక విధానం, కోత కోసి కల్లాల్లో ఉన్నప్పుడు వానలతో నష్టం జరిగితే మరో రకంగా, దిగుబడి స్వలంగా వస్తే పరిహారం అందించేందుకు మరో విధానంగా గ్రామాల పరిస్థితులకు అనుగుణంగా పథకం అమలు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా గ్రామాల్లోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా డ్రాప్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయనున్నారు.

పంటల బీమా కోసం నిర్వహించే టెండర్లలో కంపెనీలు కోట్ చేసే ప్రీమియం ధరలను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి కావడానికి విధివిధానాల రూపకల్పనకు తుదిరూపం ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం రెండు పంటలకు కలిపి రూ.2 వేల కోట్లు ప్రీమియం రూపంలో బీమా కంపెనీలకు చెల్లించాలి. ఇందులో రైతుల వాటా దాదాపు రూ. 300 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఈ ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి రైతులకు ఉచితంగా పంట బీమా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 

గతంలో 12 పంటలకు 

రైతులకు గతంలో 12 పంటలకు బీమా ఉండేది. వ్యవసాయశాఖ నోటిఫికేషన్ వెలువరించి రైతులు నుంచి ప్రీమియం తీసుకునేది. వరికి గ్రామం యూనిట్‌గా, మక్క, కంది, పెసర, మినుము, సోయా, పసుపు, వేరుశనగ, నువ్వు పంటలకు మండల యూనిట్‌గా బీమా వర్తింప జేసింది. జిల్లా వాతావరణ ఆధారిత బీమా పరిధిలోకి వానకాలం మిరప, పత్తి యాసంగిలో మామిడి పంటలు ఉండేవి. బ్యాంకుల నుంచి పంట రుణం తీసుకునే సమయంలో నేరుగా వానకాలం 2 నుంచి 5 శాతం ప్రీమియం, యాసంగిలో 1.5 నుంచి 5 శాతం ప్రీమియాన్ని బ్యాంక ర్లు మినహాయించి బీమా కంపెనీలకు చెల్లించేవారు. రైతులు చెల్లించిన కిస్తీ మొత్తంలో సమానంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మిగిలిన సగం ప్రీమియం రైతు రాయితీగా కంపెనీలు చెల్లించేవి. ఈ ప్రభుత్వం ప్రీమియం మొత్తం చెల్లిస్తామని పేర్కొనడంతో అన్నదాతలు బీమా కోసం ఎదురుచూస్తున్నారు.