పంట రుణమాఫీ ఒకేదఫాలో
- రైతుల రుణాలు 2 లక్షలు మాఫీ
- 2018-23 మధ్య తీసుకొన్న రుణాలకే
రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం
త్వరలో విడుదల కానున్న జీవో
ప్రభుత్వంపై రూ.31వేల కోట్ల భారం
47 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి l
రైతు భరోసాపై మంత్రివర్గ ఉప సంఘం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిదని తెలిపారు. శుక్రవారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. రైతు రుణాఫీనే ప్రధాన ఎజెండా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
మే 6, 2022న వరంగల్‌లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన రైతు రుణమాఫీని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటపై నిలబడుతుందని, ఇది తెలంగాణ ఏర్పాటుతో అందరికీ అర్థమైందని తెలిపారు. సోనియా మాటే శిలా శాసనమని కొనియాడారు. వ్యవసాయాన్ని పండగ చేయడమే కాంగ్రెస్ విధానమని పేర్కొన్నారు. అందులో భాగంగా ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.
బీఆర్‌ఎస్ రుణమాఫీ రూ.28 వేల కోట్లే
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో రెండు సార్లు రుణమాఫీ చేసిందని, 2014లో మార్చి 31ను కటాఫ్ తేదీతో, 2018లో డిసెంబర్ 11ను కటాఫ్ తారీఖుతో రుణమాఫీని ప్రకటించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 2014లో రూ.16 వేల కోట్లు, 2018లో రూ.12 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిందని తెలిపారు. తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్ సర్కారు రూ.28 వేల కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేసిందని, తాము 8 నెలల్లోనే రూ.31వేల కోట్లు మాఫీ చేస్తున్నామని చెప్పారు. 2018లో బీఆర్‌ఎస్ సర్కారు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను నానా ఇబ్బందులకు గురి చేసింద విమర్శించారు. వాయిదాల మీద వాయిదాల వేసుకుంటూ రైతులను సంక్షోభం వైపు నెట్టిందని ఆరోపించారు. ఫలితంగా రైతుల ఆత్మహత్యలకు బీఆర్‌ఎస్ సర్కారు కారణమైందని విమర్శించారు.
జూలై 15న మంత్రివర్గ ఉపసంఘం నివేదిక
రైతు భరోసాపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు, అర్హులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించినట్టు సీఎం చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సారథ్యంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కమిటీ వేసినట్లు వివరించారు.
ఈ ఉప సంఘం రైతు భరోసా విధివిధాలను ఖరారు చేసి, జూలై 15వ తేదీ లోపు ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని చెప్పారు. ఈ నివేదికను బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ ఆమోదం తర్వాత రైతు భరోసాను అమలు చేస్తామని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు ఇష్టం వచ్చినట్లు కథనాలు రాస్తున్నాయని, దీన్ని అరికట్టేందుకు ఆలోచన చేసినట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు. ఏదైనా అంశంపై ప్రభుత్వ తరఫున వివరణ ఇచ్చే బాధ్యతలను మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటికి అప్పగించినట్లు వెల్లడించారు.
ప్రభుత్వానికి తుమ్మల ధన్యవాదాలు
కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాల అమల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రిమండలికి రైతుల పక్షాన, రాష్ట్ర ప్రజల తరఫున ధన్య వాదలు తెలిపారు. ఈ సమావేశంలో డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.
నా జీవితంలో ఈ రోజు చారిత్రాత్మకం : సీఎం
హైదరాబాద్, జూన్ 21 ( విజయక్రాంతి): నా జీవితంలో ఈ రోజు చారిత్రాత్మకమని సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మే 6, 2022న వరంగల్ వేదికగా లక్షలాది మంది తెలంగాణ రైతులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ. నా సారధ్యంలో మంత్రి వర్గం ఆ మాటను నిలబెట్టుకున్నది. తెలంగాణ రైతులకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది’ అని సీఎం పేర్కొన్నారు.






