12 May, 2026 | 2:06 AM

స్పీడ్ పెంచిన కాంగ్రెస్

22-06-2024 12:52 AM

ఆపరేషన్ ఆకర్ష్ 

  1. బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం దిశగా అడుగులు
  2. ఇప్పటికే కాంగ్రెస్‌లోకి నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
  3. మరో 25 మందికి గాలం 
  4. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే విలీన ప్రక్రియ పూర్తయ్యేలా కసరత్తు 

హైదరాబాద్, జూన్ 21 ( విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌పై స్పీడ్ పెంచింది. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు  ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకు హస్తం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీఆర్‌ఎస్‌ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మొదలు పెట్టింది. బీఆర్‌ఎస్ నుంచి దాదాపు 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుని.. కేసీఆర్‌ను కోలుకోలేని దెబ్బతీయాలనే పట్టుదలతో సీఎం రేవంత్‌రెడ్డి  ముందుకు వెళ్తున్నారు.  గతంలో కాంగ్రెస్‌ను కేసీఆర్ రాజకీయంగా దెబ్బకొట్టిన విధంగానే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఫార్మూలాను అనుసరిస్తోంది.

ఇప్పటి వరకు ఒక్కొక్కరికి  కండువా కప్పిన కాంగ్రెస్.. ఇక మీదట వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే బీఆర్‌ఎస్ ఎల్పీని కాంగ్రెస్‌ఎల్పీలో విలీనం చేయాలనే పట్టుదలతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌లో చేరడానికి 20 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, వారు సీఎం రేవంత్‌రెడ్డితో టచ్‌లో ఉన్నారని గాంధీభవన్ వర్గాలు చెబు తున్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి, కాం గ్రెస్‌లోకి తీసుకొచ్చే బాధ్యతను పార్టీకి చెందిన ఒక సీనియర్ నేతకు సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. 

ఇప్పటివరకు నలుగురు

ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ( ఖైరతాబాద్),  కడియం శ్రీహరి ( స్టేషన్‌ఘన్‌పూర్), తెల్లం వెంకట్రావ్ ( భద్రాచలం ) పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా బాన్సువాడ బీఆర్‌ఎస్  ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగానే  ఉప్పల్  నియోజక వర్గానికి చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కూడా  శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ పరిధిలో ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రేటర్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తోంది.

గతంలోనే సీఎంను కలిసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 

సీఎం రేవంత్‌రెడ్డితో గతంలోనే  పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అప్పుడే చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని ప్రచారం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లు సునీతాలక్ష్మారెడ్డి,  గూడెం మహిపాల్‌రె డ్డి, మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌లు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. అప్పు డే పార్టీ మారుతారని ప్రచారం జరిగినా.. నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాత్రమే సీఎంతో భేటీ అయినట్లు  సదరు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. అయినప్పటికి ఆ ఎమ్మెల్యేలు  కారు దిగి.. హస్తం గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

34కు పడిపోయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య

 మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమాను వ్యక్తం చేసిన  బీఆర్‌ఎస్ పార్టీ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లతోనే సరిపెట్టుకున్నది.  సికింద్రాబాద్ కంటోన్మెంట్  ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్‌ఎస్ సిట్టింగ్  స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో  38కి చేరింది . అంతే కాకుండా నలుగురు బీఆర్‌ఎస్  ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో.. ఆ పార్టీ ఎమ్మెల్యేల  సంఖ్య 34కు పడిపోయింది.

మరి కొందరు ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ గూటికి వస్తారని, అందుకు పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని చెబుతున్నారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 ఎమ్మెల్యేలు గెలుపొందగా, 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అప్పటి సీఎం కేసీఆర్  బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. దీంతో కాంగ్రెస్  పార్టీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను కూడా బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని, కేసీఆర్ తెలంగాణలో టీడీపీ ఉనికిలేకుండా చేశారని చెబుతున్నారు. ఇప్పుడు కేసీఆర్‌కు నాటి పరిస్థితి వస్తుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 

కాంగ్రెస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు: దానం

బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే చేరుతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. బీఆర్‌ఎస్‌లో కేటీఆర్, హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డిలే మిగులుతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. హరీశ్‌రావు కూడా బీజేపీలో చేరుతారని, ఆయనతో మరి కొందరు ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం ఉందన్నారు.

కేసీఆర్ అవలంభించిన విధానాలనే బీఆర్‌ఎస్‌ను ముంచాయన్నారు.   ఒక పోచారం శ్రీనివాస్‌రెడ్డే కాదని చాల మది కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గ్రేటర్ పరిధిలో  బీఆర్‌ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని, కాలే యాదయ్య, ముఠాగోపాల్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కేపీ వివేకానంద, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి వస్తారని దానం నాగేందర్ తెలిపారు. గత మూడు రోజులుగా సునీల్ కనుగోలుతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చిస్తున్నారని, బీఆర్‌ఎస్ ఆయోమయంలో ఉందని, అందుకే ఆ పార్టీ నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నారని చెప్పారు.

పోచారం పార్టీ మారడానికి కారణమేంటి? 

కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా, లక్ష్మీపుత్రుడిగా, బీఆర్‌ఎస్ పార్టీలో సీనియర్‌గా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి కారు దిగి.. కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి బలమైన కారణమే ఉందని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నిక ల్లో బాన్సువాడ  నుంచి పోచారం తనయు డు భాస్కర్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ వద్ద ప్రతిపాదించారు. అయితే నియోజకవర్గంలో సర్వే చేయిస్తే భాస్కర్‌రెడ్డికి ప్రతికూలంగా ఉందని తేలడంతో పోచారం శ్రీనివాస్‌రెడ్డికే టికెట్ ఇచ్చారని అప్పట్లోనే చర్చ జరిగింది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతుండటం.. ఒక వైపు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లడం, మరో వైపు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు, ప్రాజెక్టులపై విచారణ జరుగుతుండం వల్ల.. బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ లేదనే అంచనాకు వచ్చారని, వచ్చే ఎన్నికల్లో రాజకీయ వారసుడిగా తనయుడిని బరిలోకి దింపాలనే ఆలోచనతో  పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీ మారినట్లుగా చర్చ జరుగుతోంది.

ప్రాణం ఉన్నంత వరకు మీరే మా నాయకుడు 

కేసీఆర్‌పై పోచారం చేసిన వ్యాఖ్యలు వైరల్ 

పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా.. మరో 20 ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే ఓపిక సీఎం రేవంత్‌రెడ్డికి ఉందని అన్నారు. అంతకు ముందు బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడిన పాత వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ‘ జన్మలో మిమ్ములను మరవం సార్.. ప్రాణం ఉన్నంత వరకు మీరే మా నాయకుడు సార్. ఇంకొకరు లేరు సార్.   47 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి నాయకుడిని చూడలేదు. అనేక మంది నాయకులను చూశాను.

రక రకాల మనుషులు ఉంటారు.. చెప్పేదొకటి.. చేసేదొకటి. చాల మంది మంత్రులను, ముఖ్యమంత్రులను చూశాను. కానీ, మనస్ఫూర్తిగా, సహృదయంతో, చల్లని చూపుతో సహాయం చేసిన వ్యక్తిగా మిమ్ముల్నే చూస్తున్నాను. నా నియోజకవర్గమే కాదు. లక్ష్మీపుత్రుడిలాగా రాష్ట్రమంతా సుభిక్షంగా మారుస్తున్నారు. దేశం అంతా మీ కోసం ఎదురుచూస్తోంది.  ’ అని గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల సమయంలోనూ కేసీఆర్ పక్కనే ఉండి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ధైర్యం చెప్పారని బీఆర్‌ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.