మెటాకు 9,030 కోట్ల జరిమానా
పై కోర్టుకు వెళతామన్న సంస్థ
న్యూయార్క్, ఆగస్టు 7: దిగ్గజ సంస్థ మెటాకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. న్యూ మెక్సికో కోర్టు రూ. 9,030 కోట్ల భారీ జరిమానా విధించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా యువత మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొంటూ ఈ జరిమానాను విధించింది. జరిమానాలో రూ. 3,993 కోట్లను చికిత్స కోసం ఖర్చు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మెటా సంస్థ రూపొందించిన ఈ యాప్‌లలో అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు, వీడియోలు, బాలల లైంగిక వేధింపులు తదితరాలపై నిజనిజాలను దాడిపెడుతోందని అమెరికాలోని 40 రాష్ట్రాల్లో పలు పిటిషన్లు నమోదయ్యాయి.
వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి న్యూ మెక్సికో రాష్ట్ర కోర్టు గురువారం విచారణలో (భారత కాలమానం ప్రకారం శుక్రవారం) జరిమానాను విధిస్తూ తీర్పు వెలువరించింది. జరిమానాలో రూ. 3, 993 కోట్లను రాబోయే ఐదేళ్లలో అవగాహన, నివారణ, స్క్రీనింగ్ సేవల కోసం ఖర్చు చేయాలని స్పష్టం చేసింది.
ఈ రెండు ఫ్లాట్‌ఫామ్‌లు యువత, పిల్లలను వ్యసనానికి గురి చేస్తున్నాయని, వారిని లైంగిక దాడుల వైపు ప్రేరేపిస్తోందని, ఇది ఎంతమాత్రం సురక్షితం కాదని, ఈ సంస్థ రూపొందించిన వీడియోలు, వ్యాఖ్యానాలు ఉద్దేశ్యపూర్వకంగానే చేసిందని, పిల్లలను ఈ యాప్‌లు కుంగుబాటు, ఇతర మానసిక ఆరోగ్య సమస్యల వైపు తీసుకువెళుతున్నాయని, సంస్థకు తెలిసినా వీటిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని న్యాయవాదులు కోర్టులో వాదించారు.
వీరి వాదనతో ఏకీభవించిన న్యూ మెక్సికో రాష్ట్ర కోర్టు న్యాయమూర్తి బీడ్‌షైడ్ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై మెటా ప్రకటన విడుదల చేసింది. కోర్టు నిర్ణయాన్ని తాము పై కోర్టులో అప్పీల్ చేస్తామని, మెటా ఫ్లాట్‌ఫామ్ నుంచి ఎప్పటికప్పుడు హానికరమైన కంటెంట్‌ను తొలగిస్తున్నామని పేర్కొంది.
యువత, పిల్లలను తప్పుదోవ పట్టించడం లేదని, వాస్తవాలను వక్రీకరించే ఆరోపణలు చేయొద్దని తెలిపారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో కూడా మెటా పక్షపాత ధోరణిని అవలంభించి వ్యవస్థాపకుడు క్షమాపణలు చెప్పే వరకు పరిస్థితి వెళ్లింది. తీరా క్షమాపణలు చెప్పాక వివాదం సద్దుమణిగినట్లయ్యింది. ఏది ఏమైనా మెటాకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా మరిన్ని చిక్కులు తప్పేలా లేవని నిపుణులు చెబుతున్నారు.






