8 August, 2026 | 1:14 AM

వాట్సాప్.. టెలిగ్రాంలో పీడీఎఫ్‌లు

08-08-2026 12:00 AM
  1. ఎన్టీయే పరిధిలోనే లీక్ అయినట్లు ప్రాథమికంగా నిర్ధారణ 
  2. నీట్ యూజీ పేపర్ లీక్ వెనుక చీకటి కోణాలు
  3. సీబీఐ చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు

న్యూఢిల్లీ, ఆగస్టు ౭: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ  ప్రశ్నాపత్రం లీకేజీ వెనుక ఎన్నో చీకటి కోణాలు వెలుగుచూస్తున్నాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాజాగా దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) పరిధిలో ప్రశ్నల తయారీ, అనువాద ప్రక్రియ సమయంలోనే పేపర్ లీక్ అయినట్టు సీబీఐ ప్రాథమికంగా నిర్ధారించింది. లీకేజీ వెనుక సబ్జెక్ట్ నిపుణులు పీవీ కులకర్ణి, మనీషా మాందరే, మనీషా హవల్దార్ ముఖ్యపాత్ర అని చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ప్రశ్నల తయారీ సమయంలో నిందితులు వాటిని కంఠస్థం చేసి, బయటకు వచ్చిన తర్వాత అమ్మకానికి పెట్టారని తెలిపింది.

మరికొందరు సీక్రెట్ సెక్షన్‌లో ఉన్నప్పుడు ఎన్‌సీఈఆర్టీ పుస్తకాల్లోని కొన్ని పేరాలను మార్క్ చేశారు. చిన్న చిన్న చీటీలపై రహస్యంగా రాసుకున్నారు. ఆ విధంగా సేకరించిన ప్రశ్నలను మధ్యవర్తుల ద్వారా బేరం మాట్లాడుకుని, లక్షలకు లక్షలు కుల్లగొట్టారు. ఈ లీకేజీ నెట్‌వర్క్ రాజస్థాన్, కేరళం వరకు విస్తరించింది. రాజస్థాన్‌లోని జున్‌ఝునూ బైపాస్ వద్ద నల్ల రంగు కారులో వచ్చిన మాంగీలాల్ బివాల్, దినేష్‌బివాల్ కుటుంబం 11 ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రశ్నాపత్రాల సెట్లను అమిత్‌కుమార్ మీనాకు అందించింది. దీనికి ప్రతిఫలంగా అభ్యర్థుల పదో తరగతి, ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్కుల సర్టిఫికెట్లను సెక్యూరిటీగా తీసుకున్నారు.

పరీక్షలో 150 కంటే ఎక్కువ ప్రశ్నలు కలిసి వస్తేనే డబ్బులు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. కేరళంలోని అడూర్ మౌంట్ జియాన్ మెడికల్ కాలేజీ హాస్టల్‌కు చెందిన హిటేష్ కుమార్ అనే విద్యార్థికి తన రూమ్‌మేట్ లక్ష్మణ్ రాజ్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ వేదికలుగా లీకైన పీడీఎఫ్ ఫైళ్లు అందాయి.

అలాగే, సీకార్‌లోని ఆర్కే ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నుంచీ పీడీఎఫ్‌లు అందాయి. ఈ వ్యవహారాన్ని సీకార్‌కు చెందిన కెమిస్ట్రీ అధ్యాపకుడు శశికాంత్ సుతార్ గుర్తించి ఎన్టీయేకు ఫిర్యాదు చేయడంతో లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన ౧౧ మంది నిందితులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. డిజిటల్ ఆధారాలు, కమ్యూనికేషన్ రికార్డులు, పుణెలోని నిందితుడి సొసైటీ యాక్సెస్ కంట్రోల్ యాప్ డేటా ఆధారంగా సీబీఐ బలమైన ఆధారాలను కోర్టుకు సమర్పించింది.