8 August, 2026 | 1:15 AM

పాట్నాలో ఉద్రిక్తత

08-08-2026 12:00 AM
  1. యువకుడి మృతితో చెలరేగిన హింస
  2. రంగంలోకి పోలీసులు.. లాఠీచార్జీ
  3. పలువురికి గాయాలు

పాట్నా, ఆగస్టు 7: బిహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ఓ యువకుడు బస్సు ప్రమాదంలో మృతి చెందడంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారు. ఆందోళన చేపట్టి వాహనాల రాకపోకలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. 10 వాహనాలకు నిప్పు పెట్టారు, పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వివరాల్లోకి వెళితే పాట్నా అగమ్‌క్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీరో మైల్ సమీపంలో మనీష్ (26) అనే వ్యక్తి రోజు మాదిరి పనికి బయలుదేరాడు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జీరో మైల్ సమీపంలోకి రాగానే అతన్ని బస్సు ఢీకొంది.

దీంతో మనీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బస్సును తగులబెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి రాగా వారిపైనా రాళ్లతో దాడికి పాల్పడి జీపులు, టూవీలర్లను తగులబెట్టారు. జాతీయ రహదారి 30ని దిగ్బంధించి, జర్నలిస్టులపైనా దాడికి దిగారు. ఒక పోలీస్ చెక్ పాయింట్‌ను ధ్వంసం చేసి పోలీసులను తరిమికొట్టారు. అందులో ఉన్న సామాగ్రితోపాటు, డబ్బు, ఫోన్లు, యూనిఫాం, బూట్లను కూడా ఎత్తుకొని పారిపోయారు.

పరిస్థితులు అదుపు తప్పుతుండడంతో 9 పోలీస్ స్టేషన్ల నుంచి అదపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులపై దాడికి పాల్పడిన వారిని వీడియోలు, ఫోటోల ద్వారా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శైలజ వెల్లడించారు. యువకుడి తల్లిదండ్రులు తమ కుమారుడి మృతికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.