500 కోట్ల మందికి ఎండదెబ్బ
న్యూఢిల్లీ, జూన్ ౨౮: జూన్‌లో ౯ రోజుల పాటు విపరీతమైన వడగాలులు వీచాయి. ఈ వడగాల్పులకు ప్రపంచ వ్యాప్తంగా ౫౦౦ కోట్ల మంది ప్రజలు ప్రభావితం అయ్యారని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఇందులో భారత్ నుంచి 619 మిలియన్ మంది ఉన్నారని పేర్కొంది. చైనాలో 579 మిలియన్లు, ఇండోనేషియాలో 231 మిలియన్లు, నైజీరియాలో 206 మిలియన్లు, బ్రెజిల్‌లో 176 మిలియన్లు, బంగ్లాదేశ్‌లో 171 మిలియన్లు, అమెరికాలో 165 మిలియన్లు, యూరప్‌లో 152 మిలియన్లు, మెక్సికోలో 123 మిలియన్లు, ఇథియోపియాలో 121 మిలియన్లు, ఈజిప్ట్‌లో 103 మిలియన్ల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో సుమారు 60 శాతం మంది ప్రజలు దీని బారిన పడ్డారని, పరిస్థితి ఇలానే ఉంటే మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. నివేదికను రూపొందించిన గ్రూప్ చీఫ్ ఆండ్రూ పెర్షంగ్ మాట్లాడుతూ.. ఒక శతాబ్దంపాటు బొగ్గు, చమురు, సహజవాయువులను కాల్చడం వల్ల కాలుష్యం పెరిగిపోయిందని, దాని కారణంగానే వడగాలులు వస్తున్నాయని తెలిపారు. కర్బన ఉద్గారాలను కాల్చడం ఆపకపోతే ఇది సర్వసాధారణమవుతుందని హెచ్చరించారు.






