నాపై కేసు కొట్టేయండి
కర్ణాటక హైకోర్టులో యెడియూరప్ప పిటిషన్
బెంగళూరు, జూన్ 28: తనపై నమోదైన పోక్సో కేసును కొట్టేయాలని కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కుట్రలో భాగంగానే కేసు నమోదుచేసినట్టు ఆరోపించారు. ఈ కేసులో కర్ణాటక సీఐడీ నమోదు చేసిన చార్జ్‌షీట్‌లో యెడియూరప్పపై తీవ్ర ఆరోపణలు చేసింది. బాధితులు కేసు పెట్టకుండా ఉండేందుకు యెడియూరప్ప సహాయకుడు బాధితురాలి తల్లికి డబ్బు ఇచ్చాడని సీఐడీ ఆరోపించింది. యెడియూరప్ప సహాయకులు అరుణ్, రుద్దేశ్, మరిస్వామిపైననా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. బెంగళూరులోని పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు లో చార్జ్‌షీట్ నమోదుచేసింది.
‘ఈ ఏడాది ఫిబ్రవరి ౨న ఉదయం 11.15 గంటల సమయంలో 17 ఏండ్ల బాధితురాలు, ఆమె తల్లి బెంగళూరులోని డాలర్స్ కాలనీలో ఉన్న యెడియూరప్ప ఇంటికి వెళ్లారు. బాధితురాలు అప్పటికే లైంగికదాడి బాధితురాలు కావటంతో ఆ కేసుతోపాటు మరికొన్ని విషయాల్లో న్యాయం చేయాలని ఆయనను కోరారు. అప్పుడు యెడ్డీ తల్లితో మాట్లాడుతూనే బాధితురాలి కుడి చేయిని తన ఎడమ చేతితో పట్టుకొన్నారు. అలాగే బాధితురాలిని తన ఇంట్లోకి సమావేశ గదిలోకి తీసుకెళ్లి తలుపు వేసి గడియ పెట్టారు. లైంగిదాడి చేసినవాడి ముఖం గుర్తున్నదా అని ఆమెను అడిగాడు. ఆమె గుర్తుంది అని చెప్పటంతో నీ వయసెంత అని యెడ్డీ అడిగాడు.
ఆమె 16.5 సంవత్సరాలు అని చెప్పింది. ఆ వెంటనే ఆయన ఆమెపై అఘాయిత్యం చేయటానికి ప్రయత్నించారు. దీంతో భయపడిపోయిన బాధితులు యెడ్డీని తోసేసి తనను వదిలేయాలని వేడుకొన్నది. దీంతో ఆయన తలుపు తెరిచి బయటకు వచ్చేశారు. బాధితురాలి చేతిలో కొంత, ఆమె తల్లి చేతిలో కొంత డబ్బు పెట్టి.. తాను ఎలాంటి సాయం చేయను వెళ్లిపొమ్మని వెల్లగొట్టారు’ అని చార్జ్‌షీట్‌లో పోలీసులు తెలిపారు.






