16 June, 2026 | 2:35 AM

30 వేల కోట్ల కుంభకోణం

16-06-2026 12:00 AM
  1. మెట్రో కొనుగోలుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
  2. ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో రైల్ కొనుగోలు వ్యవహారంలో రూ.30 వేల కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసో జు శ్రవణ్ ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన చేతగానితనాన్ని, అవినీతిని, కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్‌రెడ్డి నిత్యం కేసీఆర్, కేటీఆర్‌పై బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మార్కెట్లో దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన మెట్రో ఆస్తులను రూ.15 వేల కోట్లకే కొనుగోలు చేశామని రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకోవడం వెను క పెద్ద కుట్ర దాగి ఉన్నదన్నారు.

దీని వెనుక జరిగిన చీకటి ఒప్పందాలు ఎన్ని కోట్లో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పిపిపి మోడల్ ఒప్పందం ప్రకారం నష్టాలొచ్చినా, లాభాలొచ్చినా ఎల్ అండ్ టీ కంపెనీయే భరించాలి కానీ, సంస్థకు ఉన్న రూ.13,538 కోట్ల భారీ అప్పును తెలంగాణ ప్రజల నెత్తిన రేవంత్‌రెడ్డి ఎందుకు రుద్దారో సమాధానం చెప్పాలన్నారు. మెట్రో పరిధిలోని 60కి పైగా ప్రైవేట్ స్టేషన్లు, దాదాపు 2 కోట్ల చదరపు అడుగుల వైశాల్యం గల అల్ట్రా మోడర్న్ మాల్స్, విలువైన భూములను ప్రభుత్వం టేకోవర్ చేసుకునే నెపంతో రేవంత్ రెడ్డి తన బినామీలకు, రియల్ ఎస్టేట్ దందాల కోసం కట్టబెట్టేందుకే ఈ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. సీఎంకు దమ్ముంటే కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.