ఓట్లు దండుకోవడానికే అడ్డగోలు హామీలు
మోదీ, రాహుల్‌పై మాజీ మంత్రి పొన్నాల ఫైర్
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల ఓట్లు దండుకోవడానికే ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అడ్డగోలు హామీలిస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వివర్శలు గుప్తించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుల గణన, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ బీసీలకు మెజార్టీ సీట్లు ఎందుకు కేటాయించలేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏళ్లుగా ఉన్నవారికే న్యాయం లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎలా న్యాయం జరుగుతుందన్నారు.
తమ చేతిలో ఉన్నవి చేయకుండా అధికారంలోకి వచ్చాక చేస్తామంటే ప్రజలు ఏవిధంగా నమ్మాలని, ఇది మోసం దగా కాదా అని బీజేపీ, కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామంటూ రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ నాయకుల మాటలపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. యాసంగి పంటకు రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు ఇప్పటివరకు ఇవ్వలేదని, భవిష్యత్తులో ఇస్తుందనే నమ్మకం కూడా రైతుల్లో లేదని పేర్కొన్నారు. ఈ రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని కోరారు.




