4 April, 2026 | 6:14 PM

కోరెంటి దవాఖానకు వడదెబ్బ బాధితుల క్యూ

06-05-2024 02:26 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (విజయక్రాంతి): నగరవ్యాప్తంగా పెరుగుతున్న వడదెబ్బ సమస్యల కారణంగా ప్రజలు విలవిలలాడుతున్నారు. హైదరాబాద్ మహానగరం నిప్పుల కుంపటిగా మారింది. దీంతో ప్రజలు బయటకి రావడానికి జంకుతున్నారు. ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు తీవ్ర వడగాడ్పులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎండల వల్ల అస్వస్థతకు గురై వడదెబ్బ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి అధికమవుతుంది. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 మందికిపైగా వడదెబ్బతో మృతిచెందారు. ఈ క్రమంలో వడదెబ్బ బారిన పడిన బాధితులు కోరంటి దవాఖానకు క్యూ కడుతున్నారు.

ప్రతిరోజు సుమారు 250 నుంచి 300 మంది బాధితులు వడదెబ్బ, జ్వరం, జలుబు, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలతో వస్తున్నారని డాక్టర్లు తెలిపారు. కోరంటితో పాటు నగరంలోని గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్, బస్తీ దవాఖానాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు(యూపీహెచ్‌సీ)లు కలిపి సుమారు 900 వరకు బాధితులు వస్తున్నారని జిల్లా వైద్యాధికారులు చెప్తున్నారు. వేసవి నేపథ్యంలో ముఖ్యంగా చిన్నారులు, గర్బిణులు, బాలింతలు, వృద్ధులు,ధీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు చాలా జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమై బయటకు వెళ్లాల్సి వస్తే వాటర్ బాటిల్, గొడుగు, టోపీలు వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.

చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి

ఎండలు, వడగాడ్పులతో ఎక్కువ మంది వడదెబ్బకు గురవుతున్నారు. జ్వరం, అలసట, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లని సంప్రదించాలి. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్న సమయాల్లో బయటకి వెళ్లకూడదు. వీలైనంతా వరకు ఇంట్లోనే ఉండాలి.

 డాక్టర్ అనిల్ , ప్రొఫెసర్ ఆఫ్

మెడిసిన్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్