వనపర్తి జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కాన్ యూనిట్ సేవలు ప్రారంభం
- రూ. 2.55 కోట్లతో ఆధునిక వైద్య సదుపాయం
- పేదలకు సమీపంలోనే నాణ్యమైన పరీక్షలు
- 12 రోజుల్లో 200 లకు పైగా సిటీ స్కాన్ పరీక్షలు
వనపర్తి, మే 4 (విజయక్రాంతి ) : వనపర్తి జిల్లా ప్రజలకు అధునాతన వైద్య సేవలు మరింత చేరువయ్యాయి. జిల్లా ఆస్పత్రిలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సి ఎస్ ఆర్ నిధులతో రూ. 2.55 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ యూనిట్ ఏప్రిల్ 23 న ప్రారంభమైంది. ఈ యూనిట్ అందుబాటులోకి రావడంతో ఇకపై రోగులు పరీక్షల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది. ప్రత్యేకంగా ప్రమాదాలు, తల గాయాలు, స్ట్రోక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో సీటీ స్కాన్ పరీక్షలు కీలకంగా మారుతాయి. ఇప్పటివరకు ఇలాంటి పరీక్షల కోసం ప్రైవేట్ ఆస్పత్రులపై ఆధారపడాల్సి వచ్చిన రోగులకు ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉచితంగా ఈ సేవలు లభించనున్నాయి.
ఈ సీటీ స్కాన్ యూనిట్ ద్వారా మెదడు, ఛాతి, కడుపు వంటి భాగాల సమస్యలను వేగంగా గుర్తించవచ్చు. వైద్యులు త్వరగా నిర్ధారణ చేసి చికిత్స ప్రారంభించే అవకాశం ఉండటం వల్ల రోగుల ప్రాణాలను రక్షించడంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జిల్లా ఆస్పత్రిలో ఈ యూనిట్ ప్రారంభం కావడం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక ప్రయోజనం కలగనుంది. సమయానికి పరీక్షలు అందుబాటులో ఉండటంతో వైద్య సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆధునిక సదుపాయాలను జిల్లా స్థాయిలోనే అందుబాటులోకి తీసుకువస్తోందని, భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
12 రోజుల్లో 200 లకు పైగా సిటీ స్కానింగ్ పరీక్షలు ..
గత నెల 23 వ తేదీన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసీ ఎమ్మెల్యే మేఘారెడ్డి సీటీ స్కాన్ కేంద్రాన్ని ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే. ప్రారంభించిన రోజు నుండి నేటి వరకు దాదాపు 200 లకు పైగా సిటీ స్కానింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని జిల్లా వైద్యాధి కారి తెలిపారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం మా లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా నగర స్థాయి సదుపాయాలు పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యూనిట్ను ఏర్పాటు చేసింది. ఇకపై ఎవరూ పరీక్షల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. జిల్లా ఆస్పత్రినే ఆధునిక వైద్య కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం.
- తూడి మేఘా రెడ్డి, వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు
సీటీ స్కాన్ యూనిట్ అత్యవసర సేవల్లో కీలక పాత్ర
ఈ సీటీ స్కాన్ యూనిట్ అత్యవసర సేవల్లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు, తల గాయాలు, బ్రెయిన్ స్ట్రోక్, అంతర్గత రక్తస్రావం వంటి కేసుల్లో సీటీ స్కాన్ అత్యంత అవసరం. ఇప్పుడు ఆస్పత్రిలోనే ఈ సదుపాయం ఉండటంతో తక్షణ నిర్ధారణ చేసి చికిత్స ప్రారంభించగలుగుతాం. ఇది ప్రాణాలను కాపాడటంలో కీలకం.
- డాక్టర్ సాయి నాథ్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి






