సర్వే నెం.273 భూముల వివాదం: రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి తుమ్మల
దమ్మపేట సర్వే నెం.273 రైతుల భూముల్లోకి ఎవరికీ వచ్చే హక్కు లేదు
నాడు నా చేతుల మీదుగానే పేదలకు పంపిణీ చేసిన భూములివి
రైతులకు పూర్తి భరోసా ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని రైతులకు సూచన
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట మండలంలోని నల్లకుంట గ్రామం సర్వే నెం.273 పరిధిలో భూములు సాగు చేసుకుంటున్న రైతులు సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. భూములకు సంబంధించిన వివాదంపై తమ ఆందోళనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రైతుల వినతిని విన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ, గతంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పేదలకు కేటాయించిన భూములపై చట్టబద్ధ హక్కులను పరిరక్షించే దిశగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందకుండా, న్యాయపరమైన మార్గాల్లో సమస్యల పరిష్కారానికి ముందుకు సాగాలని సూచించారు.
అలాగే, సంబంధిత అంశాలను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని రైతులకు మంత్రి సూచించారు. అవసరమైతే తాను కూడా జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.
మంత్రి స్పందనతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కొయ్యల అచ్యుతరావు, రావు గంగాధరరావు, కాసాని నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






