10 May, 2026 | 1:24 AM

సైబర్ మోసాల కాలం

10-05-2026 12:00 AM

సాంకేతికత సాయంతో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న దరిమిలా సైబర్ నేరాలు కూడా నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఒకప్పుడు బ్యాంకింగ్ మోసాలకు మాత్రమే పరిమితమైన సైబర్ క్రైమ్‌లు ఇప్పుడు డిజిటల్ అరెస్టులు, ఫేక్ పేమెంట్ యాప్‌లు, సోషల్ మీడియా హ్యాకింగ్, ఓటీపీ మోసాలు వంటి సరికొత్త రూపాలను సంతరించుకుంటున్నది. విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుల వరకు, నిరుద్యోగుల నుంచి రిటైర్డ్ ఉద్యోగుల వరకు అందరూ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి విలవిల్లాడిపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం.

డిజిటల్ అరెస్టు మూలంగా మహబూబాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ టీచర్ రూ.82 లక్షలు పోగొట్టుకున్న ఘటన తాజాగా వెలుగుచూడటం ఉన్నత విద్యావంతులే సైబర్ నేరాల బాధితులుగా మారుతున్నారని చెప్పేందుకు ప్రత్యక్ష తార్కాణం. ఈ నేపథ్యంలో దేశంలో సాధారణ నేరాలు తగ్గి, సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం 2024లో దేశవ్యాప్తంగా 1.01 లక్షల సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి.

అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువ. అయితే, దేశంలో అత్యధిక సైబర్ నేరాలు నమోదైన రాష్ర్టంగా తెలంగాణ నిలవడం మన రాష్ట్రానికి ఎంతమాత్రం గర్వకారణం కాదు. 2024లో మన రాష్ట్రంలో 27,230 సైబర్ నేరాలు నమోదు కాగా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 49 శాతం అధికం కావడం ఆందోళనకరం. అయితే, హైదరాబాద్ నగరంలో 17 శాతం సైబర్ నేరాలు తగ్గడం కొంత ఊరటగా కనిపిస్తున్నా; గ్రామీణ తెలంగాణ, ఇతర నగరాలపై సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారని దీని ద్వారా తెలుస్తున్నది.

ఫేక్ ట్రేడింగ్ యాప్‌లు, డిజిటల్ అరెస్టులు, ఓటీపీ మోసాల కారణంగా 2024లో ప్రజలు రూ.1,866 కోట్లు నష్టపోయారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నివేదించిన విషయం తెలిసిందే. కానీ, ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినా రూ.వందల కోట్లు మాత్రమే తిరిగిరాబట్టడం రికవరీ పెరగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తున్నది.

సరైన ఆధారాలు లేకపోవడం, ట్రేష్ కాకపోవడం లాంటి కారణాల వల్ల అనేక కేసుల్లో ముందడుగు పడకపోవడం శోచనీయం. రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో వీటి పట్ల అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే, సైబర్ నేరాలను అరికట్టాలంటే కేవలం ప్రభుత్వ చర్యలు సరిపోవని ప్రజలూ గ్రహించాల్సిన తరుణమిది.