సైబర్ నేరస్తులతో చేతులు కలిపిన ముఠా అరెస్ట్
- మ్యూల్ అకౌంట్స్ ద్వారా సైబర్ నేరాలు
- 8.18 కోట్ల రూపాయల లావాదేవీలు గుర్తింపు
- నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల
నిర్మల్, జూన్ 4 విజయ క్రాంతి): డబ్బు ఆశతో తమ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, చెక్బుక్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించి ఆన్లైన్ మోసాలకు సహకరించిన ఐదుగురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గురువారం జిల్లా పోలీసులతో కలిపి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.. లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నిమ్మగజేందర్, మగ్గిడి నవీన్, సోన్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన మేకల నిఖిల్, షికారి సాయి కృష్ణ లను నిందితులుగా గుర్తించి పట్టుకోవడం జరిగింది అన్నారు. వారి ఖాతాల నుండి రూ. 8.18 కోట్ల లావాదేవీలు జరిపినట్టు విచారణలో తేలింది . నిందితులు 2024 సంవత్సరం నుంచి తమ పేర్లతో పాటు వ్యాపార సంస్థల పేర్లపై వివిధ బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు ప్రారంభించి, వాటికి సంబంధించిన ఏటీఎం కార్డులు, చెక్బుక్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేర ముఠాలకు అందించారన్నారు .
దేశంలోని పలు రాష్ట్రాల్లో అమాయకులను ఆన్లైన్ మోసాలకు గురిచేసి సంపాదించిన డబ్బును ఈ ఖాతాల ద్వారా స్వీకరించి, అనంతరం ఇతర ఖాతాలకు బదిలీ చేస్తూ నేరగాళ్లు డబ్బు జాడను దాచిపెట్టేవారు.ఇందుకు ప్రతిఫలంగా ఖాతాదారులు కమీషన్లు పొందినట్లు విచారణలో తేలింది. విచారణలో నిమ్మ గజేంద్ప 9, మగ్గిడి నవ్పీ 28, మగ్గిడి మహేంద్ప 5, మేకల నిఖ్పి 16, షికారి సాయి కృష్ణపై 6 సైబర్ ఫిర్యాదులు ఎన్సీఆర్పీ పోర్టల్లో నమోదు అయినట్టు తెలిపారు .
వీరు నిర్వహించిన వివిధ బ్యాంకు ఖాతాల విశ్లేషణలో భారీ మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు బయటపడింది. ఇప్పటివరకు విశ్లేషించిన ఖాతాల్లో నిమ్మ గజేందర్కు చెందిన R.V Traders ఖాతా ద్వారా సుమారు.2.69 కోట్ల రూపాయలు, మగ్గిడి నవీన్ కు చెందిన Azan Traders ఖాతా ద్వారా సుమారు 2.11 కోట్ల రూపాయలు, మగ్గిడి మహేందర్ కు చెందిన N.R Enterprises ఖాతా ద్వారా సుమారు 91.36 లక్షల రూపాయలు,మేకల నిఖిల్కు చెందిన HR Automobiles Hardware & electricals ఖాతా ద్వారా 1.18 కోట్ల రూపాయలు, షికారి సాయి కృష్ణకు చెందిన HN Enterprises ఖాతా ద్వారా 1.28 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి.
మొత్తం మీద రూ.3.84 కోట్లకు పైగా నగదు చలామణి జరిగినట్లు నిర్ధారించడం జరిగింది. నాలుగు రోజుల్లోనే 8 కోట్ల లావాదేవీ జరిగా మరింత లోతుగా విచారణ జరిపి వీరితో సంబంధం ఉన్న వారందరిని పట్టుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లాలో 100 కోట్ల వరకు మోసం జరిగినట్టు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. లోకేశ్వరం మండలానికి చెందిన ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, సోన్ మండలానికి చెందిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది.వీరికి సంబంధించిన ఇతర బ్యాంకు ఖాతాలు, సైబర్ నేర ముఠాలతో ఉన్న సంబంధాలు,
కమీషన్ చెల్లింపులు, డిజిటల్ ఆధారాలపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, తెలిపారు. ఈ కేసు చేదనలో చాక చక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన భైంసా ఏఎస్పీ సాయి కిరణ్,ఐపీఎస్, నిర్మల్ డిఎస్పీ శ్రీనివాస్, ముధోల్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్, సోన్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకట రమణ,ఎస్.ఐ లు గోపి, అశోక్, సిబ్బందిని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.






