15 April, 2026 | 4:16 PM

ఈ దరిద్రం పాడుగాను.. గిదేం ప్రభుత్వం?

14-04-2026 12:00 AM
  1. నేను మంత్రుల కాళ్లు మొక్కాలా?

బిల్లుల కోసం ఫోన్ చేసినా స్పందన లేదు

సీఎంకి 20 సార్లు చెప్పినా

వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి

కాంగ్రెస్‌పై అసహనం వ్యక్తం చేసిన పోచారం  

కామారెడ్డి, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరుగుబాటు ప్రకటించారు. బాన్స్‌వాడ నియోజకవ ర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆగకూడదని ఉద్దేశంతో ప్రభుత్వంలో చేరినట్లు ప్రకటించారు. అభివృద్ధి పనుల మంజూరులో ప్రభుత్వం వ్యవహరి స్తున్న తీరుపై అసహనం, ఆవేదన వ్యక్తపరిచారు. బాన్స్‌వాడ నియోజకవర్గంలోని వర్ని మండలం సిద్దాపూర్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన ఆయన ఆదివారం అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి నిరసన వ్యక్తం చేశారు.

నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజ నీర్‌తో ఫోన్లో మాట్లాడారు.పోచారం చీఫ్ ఇంజనీర్ తో ఫోన్లో మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. ‘నిధుల విషయంలో ఎమన్నా కదలిక ఉందా లేదా.. నేను సీనియర్ ఎమ్మెల్యేని.. నిన్న మొన్న ఎమ్మెల్యేను కాలేదు.. నేను సీఎంగారికి 20 సార్లు చెప్పినా..ఇక నేను మొండిగా ఇంట్లోనుంచి బయటకు కాలు పెట్టా.. ఏమన్నా కాని.. ఏదన్నా కానీ చావని బతకని.. నేను ఎన్నిసార్లు ఫోన్లు చేయాలి.. నేను మంత్రిని చేశా 20 ఏళ్లు.. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ఫోన్లు తీయరు ఏంటండి ఇది ఈ దరిద్రం పాడుగాను.. గిదేం ప్రభుత్వం..

నిధుల మంజూరు కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా.. మేము ఎవరికి చెప్పుకోవాలి.. ఎవరితో మాట్లాడాలి అని పోచారం అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రజల కోసమే ఫోన్ చేస్తాం, నాలాంటి వాళ్లకే స్పందించకపోతే, ఈ రాజకీయం ఎందుకు? ఈ వయసులో కాళ్లు మొక్కి పనులు చేసుకోవాలా అని నిలదీశారు.రాష్ట్రంలో ఆసలు ప్రభుత్వం ఉందా? ఉంటే అది సక్రమంగా పని చేస్తుందా?..బిల్లుల కోసం మంత్రులకు ఫోను చేసిన లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తన ఫోను లిఫ్ట్ చేయడం లేదు. బిల్లులు రాక పనులు ఆగిపోతున్నాయని, కాంట్రాక్టర్లు పనులు చేయకుండా వదిలి వెళ్లిపోతున్నారని తెలిపారు. వారిని బ్రతిమిలాడి పనులను ముందుకు నడిపిస్తున్నానన్నారు. బిల్లులు రాక చేపట్టిన పనులు ఆగిపోతే తుమ్మ చెట్లు మొలుస్తాయి. అని ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రావడం లేదని అన్నారు. బీఆర్‌ఎస్ హాయంలో ఇంట్లో ఉండి కోరితే జీవోలు, బిల్లులు వచ్చాయని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన మాటలు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

కాగా  సిద్దాపూర్ ఎత్తిపోతల రిజర్వాయర్ పనుల కోసం నిధుల మంజూరు పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం, ఆవేదన వ్యక్తపరిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన అమలు కాలేదన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి 20 సార్లు విన్నవించిన నిధులు మంజూరు కావడం లేదన్నారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వందల కోట్ల అభివృద్ధి పనులు ఆగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వంలో చేరితే ఫలితం లేకుండా పోతుందన్నారు.

గత రెండు రోజుల క్రితమే జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డి తో పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి మాట్లాడినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరెందుకు కేసిఆర్ దృష్టికి తీసుకువెళ్లి తమకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. ఆ విషయం బయట పడడంతో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం రాత్రి సిద్దాపూర్ ఎత్తిపోతల పథకం వద్ద ప్రభుత్వం తీరుపై ముఖ్యమంత్రి, మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.