28 May, 2026 | 2:50 AM

శిల్పారామంలో అలరించిన నృత్య ప్రదర్శన

28-05-2026 01:36 AM

శేరిలింగంపల్లి మే 27 (విజయక్రాంతి): మాదాపూర్లోని శిల్పారామంలో బుధవారం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహూతులను ఎంతగానో అలరించింది. మహబూబ్నగర్ నుంచి విచ్చేసిన నాట్య గురువు శాంతి గారి శిష్య బృందం ఈ ప్రదర్శన ఇచ్చింది.

కళాకారులు గణేశా కౌతం, సూర్యాష్టకం, తాండవమాడెను శివుడు, అన్నయ్య సంకీర్తనలు, గణేశా పంచరత్న, తారంగం, గోవిందా నామాలు, జయ జయ దుర్గే, దేవా దేవాంభజే, మంగళం అంశాలను ప్రదర్శించి మెప్పించారు.

భవిష్య, మహాసేన, నిత్య, వైష్ణవి, లక్ష్య, లాస్యశ్రీ, తన్విక, శ్రీమాన్య, లలిత, మహతి, యశ్వి తదితరులు తమ అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యంలోని హావభావాలు, పాదభేదాలు, తారంగం విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. కార్యక్రమానికి స్థానికులతో పాటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.