ఆకాడి దేవతల పూజలతో దండారి ఉత్సవాలకు శ్రీకారం
నాలుగు నెలల పాటు రాత్రి వేళలో డప్పులు మోత... చచోయి చచోయ్ ఆటలు
ఉట్నూర్, జూలై 17 : ఆదివాసి గిరిజనులు అంటేనే... ప్రకృతి పూజారులు.. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభంలో వన దేవతలతో పాటు ప్రకృతి దేవతలకు పూజలు చేస్తారు. ప్రతి ఏటా ఆషాడ మాసంలో వచ్చే పండుగలను ఆదివాసి గోండి భాషలో ఆకాడి పూజలను వనదేవతలకు చేస్తారు. ఆకాడి పూజలు చేసిన వెంటనే ఆదివాసులతోపాటు పశువులకు వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు రాకుండా దేవతలకు మొక్కులు తీర్చుకుంటారు. ఆకాడి దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పసుపు కుంకుమలతో గీతలు వేసి గీతలపై నుంచి పశువులను దాటిస్తారు.
ఇలా చేయడంతో అడవిలో మేతకు వెళ్లిన పశువులపై అడవి జంతువులు దాడి చేయమని ఆదివాసి గిరిజనుల విశ్వాసం. ప్రతి గూడెం పొలిమేరలోని అడవిలో ఈ పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం గూడానికి చేరుకొని రాత్రి వేళలో దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసి గిరిజనులు జరుపుకునే దండారి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. దండారి దేవతలను గ్రామ పటేల్ ఇంటి వద్ద చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించి దండారి ఉత్సవాలకు శ్రీకారం చేస్తారు.
నాలుగు నెలల పాటు ప్రతిరోజు రాత్రి డప్పులను కొడుతూ.. దండారి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే చచోయి.. చచోయ్ ఆటలను లయబద్ధంగా డప్పుల చప్పుల్లతో ఆడుతుంటారు. దీపావళి పండుగకు వారం రోజులు ముందు దండారి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లోని ఆదివాసి గోండు గుడాల్లో ఆకాడి పూజలను గిరిజనులు వారి సంస్కృతి సాంప్రదాయం, ఆచార వ్యవహారాలతో పూజలను నిర్వహిస్తున్నారు. ఆకాడి దేవత పూజలకు ప్రతి ఇంటి నుంచి మగవారు తప్పనిసరిగా పాల్గొని గ్రామస్తులు నిర్వహిస్తారు. గ్రామస్తులు నిర్ణయం మేరకు ఆకాడి పూజలకు మగవారు పాల్గొని దేవతల మొక్కులు తీర్చుకుంటారు.






