18 July, 2026 | 1:41 AM

40 ఏళ్లుగా నిరీక్షణ!

18-07-2026 01:41 AM

వట్టేరు వాగు ఆనకట్ట పునరుద్ధరణకు గ్రహణం 

  1. నాలుగు  క్రితం రూ.18 లక్షలతో నిర్మాణం 
  2. నేడు శిథిలావస్థలో ప్రాజెక్టు 
  3.   1,160 ఎకరాలకు అందని సాగు నీరు 
  4. ఏటా గోదావరిలో కలుస్తున్న వరద 
  5. పరిహారం పంచాయితీ కొలిక్కి వస్తేనే మోక్షం! 
  6. నిధుల కొరతా? నిర్లక్ష్యమా?

(బండి సంపత్‌కుమార్) :

మహబూబాబాద్, జూలై ౧౭ (విజయక్రాంతి): ఆరు గ్రామాల రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని నిర్మించిన వట్టేరు వాగు ప్రాజెక్టు..  నేడు ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచింది. 40 ఏళ్ల క్రితం సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఆనకట్ట కుంగిపోవడం, షట్టర్లు ధ్వంసం కావడం, కాలువలు పూడికతో పేరుకుపోవడంతో వేలాది మంది రైతుల ఆశలు కూడా అడుగంటిపోయాయి.

గోదావరిలోకి వృథాగా వెళ్లే వరద నీటిని వినియోగించాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాల నలో వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్దకొరుపోలు వద్ద రూ.18.18 లక్షల వ్యయంతో వట్టేరు వాగుపై ఆనకట్ట నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వరంగల్, మహ బూబాబాద్ జిల్లాల్లో నెక్కొండ, కేసముద్రం మండలాల పరిధిలోని పెద్దకొరుపోలు, చిన్నకొరుపోలు, నాగారం, ఇంటికన్నె, వెంకటగిరి, ఉప్పరపల్లి గ్రామాలకు చెందిన 1,160 ఎకరాల భూమికి సాగునీరు అందించడంతో పాటు గ్రామాల చెరువులను నింపే లా ప్రణాళిక రూపొందించారు.

ఎగువ ప్రాంతంలోని చెరువులు, అటవీ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటిని ఆనకట్ట వద్ద నిల్వ చేసి, కుడి--ఎడమ కాలువల ద్వారా చెరువు లు, వ్యవసాయ భూములకు మళ్లించేలా అప్పట్లో రాతి నిర్మాణంతో ప్రాజెక్టును ని ర్మించారు. వరద ప్రవాహానికి ఆటంకం కలగకుండా ఆక్విడెక్టులు ఏర్పాటు చేయడం ఆ కాలంలోనే ఇంజినీరింగ్ ప్రత్యేకతగా నిలిచింది.

పరిహారంపై వీడని వివాదం

ప్రాజెక్టు, కాలువల నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు సేకరించినప్పటికీ, ఇంటికన్నె, వెంకటగిరి గ్రామాలకు చెందిన 16.23 ఎకరాల భూమికి చెల్లించాల్సిన పరిహారంపై వివాదం తలెత్తింది. ఎకరానికి రూ.90 వేల చొప్పున పరిహారం ప్రకటించడాన్ని రైతులు వ్యతిరేకించారు. దీంతో కుడి కాలువ పనులు పూర్తికాకుండానే నిలిచిపోయాయి. కొంతకాలం సాగునీరు అందినప్ప టికీ, తర్వాత పరిహారం సమస్యను పరిష్కరించకపోవడంతో ప్రాజెక్టు నిర్వహణ కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.

శిథిలమవుతున్న ఆనకట్ట.. వృథాగా పారుతున్న నీరు

కాలక్రమేణా ప్రాజెక్టులో భారీగా పూడిక పేరుకుపోయింది. ఆనకట్ట కుంగిపోయింది. షట్టర్లు పూర్తిగా పనికిరాకుండా పోయాయి. కాలువలు, ఆక్విడెక్టులు ధ్వంసమయ్యాయి. క్యాచ్‌మెంట్ ప్రాంతం ఆక్రమణలకు గురైం ది. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయి, 1,160 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు ప్రస్తుతం నామమాత్రంగా మిగిలిపోయింది.

ప్రతి వర్షాకాలం లో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే సుమారు 25 క్యూసెక్కుల వరద నీరు ఎలాంటి వినియోగం లేకుండా వట్టేరు వాగు ద్వారా గోదావరిలో కలుస్తోంది. ప్రాజెక్టును పునరుద్ధరిస్తే ఆరు గ్రామాల రైతులకు సాగునీటి భరోసా కలగడంతో పాటు గ్రామాల చెరువులు కూడా నిండుతాయని రైతులు చెబు తున్నారు.

ప్రభుత్వం చేయాల్సింది..

* వట్టేరు వాగు ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలి.

* కుడి, ఎడమ కాలువలను మరమ్మతు చేసి తిరిగి వినియోగంలోకి తేవాలి.

* ధ్వంసమైన ఆక్విడెక్టులను పునర్నిర్మించాలి.

* ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించాలి.

* ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుని హద్దులు నిర్ణయించాలి.

* భూములు కోల్పోయిన రైతులకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలి.

* ఆయకట్టు రైతులతో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలి.

* ఇప్పటి మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలి.

* ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చి 40 ఏళ్లు గడిచినా రైతులకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. ఇంతకాలం పంటలు పండించలేక తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించడంతో పాటు పంట నష్టానికీ న్యాయం చేసి, ప్రాజెక్టును వెంటనే పునరుద్ధరించాలి.

 మర్రి నారాయణరావు, వట్టేరు వాగు ప్రాజెక్టు 

ఆయకట్టు రైతు