అకాల వర్షం.. రైతుల ఆగమాగం
దంచి కొట్టిన వానతో కోలుకోలేని పంట నష్టం
నేలకొరిగిన వరి, మొక్కజొన్న పంటలు
తీవ్రంగా నష్టపోయిన రైతులు
ఆందోళనలో అన్నదాతలు
ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్
కామారెడ్డి, మార్చి 31 (విజయక్రాంతి): అకాల వర్షం ఉమ్మడి జిల్లాలోని రైతులకు అపారనష్టం మిగిల్చింది. రైతులు కోలుకోలేని విధంగా పంట నష్టపోయారు. వేలాది ఎకరాల పంట నేలకొరిగింది. వరి ధాన్యం గట్టి గింజ గా మారనున్న సమయంలో ఈదురు గాలులు వడగళ్ల వాన వల్ల వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంట నేలకొరిగింది. దీంతో రైతులు ఆగమవుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అకాల వర్షాలతో పాటు వడగళ్ల వాన తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్, మహమ్మద్ నగర్, భిక్కనూర్, దోమకొండ, లింగంపేట్, తాడువాయి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, జుక్కల్, పెద్ద కొడప్గల్, నస్రుల్లాబాద్, పిట్లం, మాచారెడ్డి, రామారెడ్డి, రాజంపేట, మండలాల్లోని ఆయా గ్రామాల్లో వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి.
పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల వల్ల నేలకొరవడంతో పంట దిగుబడి తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. ఎంతో పెట్టుబడి పెట్టి పంట వేసి చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు వడగళ్ల వర్షాల వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని రైతులకు తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఉమ్మడి జిల్లాల రైతులు కోరుతున్నారు. తాజాగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెల్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆరెంజ్ అలర్ట్ చేసిన వాతావరణ శాఖ
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి , మంగళవారం తెల్లవారుజామున ఉమ్మడి జిల్లాలో దంచి కొట్టిన వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి, మొక్కజొన్న పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. వ్యవసాయ అధికారులు పంట నష్టం వివరాలను అంచనా వేసి ప్రభుత్వానికి అందజేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలోనీ కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ విధించారు. భారీ ఈదురు గాలుల తో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 41-61 కిలోమీటర్ల గరిష్ట ఉపరితల గాలి వేగంతో కూడిన ఉరుములు మెరుపులతో గాలివాన కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు.




