25-08-2025 12:00:00 AM
వడ్లకొండ ఉమారాణి :
నేడు మఖ్దూం మోహియుద్దీన్ వర్ధంతి :
ఏక్ చమేలీ కే మండ్వే తలె
(ఒక మల్లె పందిరి కింద)
ఉర్దూ:
ఏక్ చమేలీ కే మండ్వే తలె,
మైకదే మేరా సజ్ గయా థా,
ఏక్ చమేలీ కే మండ్వే తలె..
ఫూల్ నహీ థే, శరాబ్ నహీ థీ,
ఏక్ ఆఖ్ నషాబ్ కీ థీ..
ఫిర్ బి మైకదే మేరా సజ్ గయా థా..
తెలుగు:
ఒక మల్లె పందిరి కింద,
నా మధుశాల ముస్తాబై ఉంది,
ఒక మల్లె పందిరి కింద,
పూలు లేవు.. మధువూ లేదు,
కానీ, ఒక నయనం మత్తు నింపుకొన్నది..
అయినా, నా మధుశాల ముస్తాబై ఉంది !
హవా (గాలి)
ఉర్దూ:
హవా కే హోంఠోం పర్ హై జైసే,
కోయీ ప్యాస్ కా గీత్,
క్యా తుమ్ నహీ సమోగే,
ఇస్ ఆగ్ కా గీత్,
జో మేరీ జాన్ మే హై,
ఔర్ మేరీ నహీ..
తెలుగు:
గాలి పెదవులపై ఎవరిదో విరహ గీతం..
ఆ సరాగాన్ని ఆలకించలేవా..?
నిప్పు కణికలాంటి గీతమది..
అది నా ప్రాణంలో ఉంది,
కానీ, అది నాది కాదు..
అంటూ నిలువెల్లా కవిత్వమై ఉప్పొంగాడు ప్రఖ్యాత ఉర్దూ కవి మఖ్దూం మోహియుద్దీన్. ఆతడు ఉర్దూ, పార శీ భాషలకు నగిషీలద్దాడు. కవితా సుధలు ధారపోశాడు. నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ‘అది ఒక దయ్యా ల మేడ.. శిథిల సమాజాల నీడ.. పీనుగులను పీక్కుతినే రాబందుల రాచవాడ.. అద్యంతం అంతులేని అరిష్టాల మహాపీడ.. ఎటు చూస్తే అటు చీకటి.. ఎటుకన్నా శిథిలాలే (ఉర్దూ కవితకు తెలుగు అనువాదం)’ అంటూ గర్జించిన ధీశాలి.
పాతబస్తీలో ‘ముషాయిరాలు’ నిర్వహించి నగరానికి సాహితీ పరిమళాలు అద్దిన సాహీతీవేత్త. అచ్చమైన హైదరాబాదీ. మఖ్దూం 1903లో అప్పటి మెదక్ జిల్లాలో ని ఆందోల్‌లో జన్మించాడు. తనకు నాలుగేళ్ల వయసున్నప్పుడు తండ్రి కాలం చేయగా, తల్లి మరో వివాహం చేసుకున్నది. అలా మరెన్నో కారణాల వల్ల మఖ్దూం అనాథగా మిగిలిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో చిన్నాన్న బషీరుద్దీన్ ఖాన్ చేరదీశాడు. మఖ్దూం ప్రాథమిక విద్య సంగా రెడ్డిలోని ధర్మవంత పాఠశాలలో సాగింది.
మెట్రిక్యులేషన్ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. 1929లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ కోర్సులో చేరాడు. చిన్ననాటి మఖ్దూంకు సాహిత్యాభిలాష ఉండేది. ఈ క్రమంలోనే ఆయన ఉర్దూ సాహిత్యానికి ఆకర్షితుడయాడు. ఉర్దూలో పట్టు సాధించడమే కాదు, పాండిత్యా న్ని సంపాదించాడు. ఆ ప్రయాణం ఎందరో ఉర్దూ, తెలుగు కవులను దగ్గర చేసింది. అలా మఖ్దూం ఉభయ మిత్రుడిగా ఆదరాభిమానాలు అందుకోవడం ప్రారంభించాడు.
సాహిత్య కృషీవ లుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. మఖ్దూం యూనివర్సిటీలో సరదాగా ‘పీలాదు షాలా’ (పచ్చ శాలు వా) అనే పేరుతో మొట్టమొదటి కవిత రాశాడు. మఖ్దూం ఏ తరగతి గదికి వెళ్లినా, రాజకీయ సభలకు వెళ్లినా తన పద్యాలే చెప్పమనేవారు విద్యార్థులు. తన కవితాగానం కోసం అంతగా ఎదురుచూసేవారంటే ఆతిశయోక్తి లేదు.
అలా మొదలైన కవితా ప్రస్థానం అంచెలంచెలుగా ఎదగ డం ప్రారంభమైంది. ‘టూర్’ అనే కవితతో మఖ్దూం తన భావ కవిత్వ ఒరవడిని ప్రారంభించాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ (ఉర్దూ) పూర్తి చేసి హైదరాబాద్‌లోనే చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు. కొంతకాలం సిటీ కాలేజీలో ఉపాధ్యాయుడిగా ఉర్దూ పాఠాలు చెప్పేవాడు. చిన్న పత్రికలకు సామాజిక, రాజకీయపరమైన వ్యాసాలు రాసేవాడు.
కార్మిక సంఘాల్లో కీలక నేతగా..
కార్మిక సంఘాల్లో చేరి కీలకంగా వ్యవహరించేవాడు. ఎన్‌ఎస్సార్ రైల్వే ఎంప్లాయీస్, బటన్ ఫ్యాక్టరీ, షాబాదు సిమెంట్, పీడబ్ల్యూడీ, మున్సిపాలిటీతో పాటు అనేక సం ఘాలకు నాయకత్వం వహించాడు. సింగరేణి బొగ్గు గనుల కార్మిక సంఘం ఏర్పాటుకు అప్పటి కార్మికనేత శేషగిరిరావుకు సహాయ సహకారాలు ఆందించేవాడు.
ఆయన్ను సన్నిహితులందరూ ‘హాజీ సాబ్’ అని ముద్దుగా పిలుచుకునేవారు. సాదాసీదాగా బతుకుతున్న మఖ్దూంను జనం తమ సొంత మనిషిలా భావించేవారు. మఖ్దూం సాహితీ ప్రయాణంలో ఐరీష్ రచయిత జార్డ్ బెర్నాడ్ షా రాసిన ‘విధుర గృహాల’ను మిత్రుడు హస న్ సాయంతో ‘హోష్ కే నాఖూన్’ పేరు తో ఆనుసరణ చేశాడు.
ఈ నాటకాన్ని హైదరాబాద్‌లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అతిథిగా విచ్చేసిన వేదికపై ప్రదర్శించగా, మఖ్దూం నటనా కౌశలా న్ని చూసి ఠాగూర్ మంత్ర ముగ్ధుడయ్యాడు. తానే స్వయం గా వేదికపైకి వెళ్లి స్వయంగా ‘జనగణమన’ ఆలపించారు. అప్పటికీ ఆ గీతం జాతీయ గీతం కాదు. ఠాగూర్ స్వయంగా తన శాంతినికేతన్‌ను సందర్శించాలని మఖ్దూంను ఆహ్వానించాడు.
బొగ్గు పెల్లలతో గోడలపై కవితలు..
అప్పటి రాజకీయ నిర్బంధాల్లో మఖ్దూం అనేక సార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలు జీవితంలోనూ మఖ్దూం కవితలు రాశాడు. ఆ సమయంలో రాసిన ‘ఖైదు’ కవిత తర్వాత పత్రికల్లో ప్రచురితమై విఖ్యాతినొందింది. జైలులో పేపర్, పెన్ను అందుబాటులోకి లేకపోయినప్పటికీ, మఖ్దూం బొగ్గు శకలాలతో అక్కడి గోడలపై ఉర్దూ కవితలు రాశాడు. హైదరాబాద్‌లో ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్న ‘జలాలుద్దీన్’ హాస్యోక్తుల సృష్టికర్త మఖ్దూంనే.
జన బాహుళ్యంలో ఉన్న ఆ కవితలు విని, అవి కచ్చితంగా మఖ్దూం రాసి ఉంటాడని చెప్పేవారు సాహిత్యాభిలాషులు. మఖ్దూం కవితలకు మంత్రముగ్ధులైన ఎందరో సాహితీప్రియులు, అభిమానులు ఆయన ఇంటికి బుట్టలకు బుట్టలు గా పూలు పంపించేవారు. మఖ్దూం రచనలన్నీ స్వేచ్ఛా ప్రణయం, శ్రమ గౌరవం, మత మౌఢ్యాలపై తిరుగుబాటు, సాంఘిక సమస్యలపైనే ఉండేవి.
మఖ్దూం ఉర్దూ రచనలను తెలుగులోకి అనువదించి పాఠకులకు పరిచయం చేసిన కవి దాశరథి కృష్ణమాచార్యులు. 1944 51 మధ్య మఖ్దూం రాసిన ‘తెలంగాణ్’ కావ్యాన్ని దాశరథి ‘తెలుగు పిల్ల’ పేరుతో అనువదించాడు. వారిద్దరూ చిరకాల మిత్రు లు. మఖ్దూం ఉర్దూ కవితలైన ‘ముస్తఖ్బిల్’, ‘అప్నా షహర్’ను తెలుగులోకి తర్జుమా చేశాడు.
ఇవి కాక మరికొన్ని కవితలను సీ నారాయణరెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి, గజ్జెల మల్లారెడ్డి, కౌముది అనువదించారు. మఖ్దూం కవితల్లో అంధేరా (చీకటి), హవేలీ (దెయ్యాల మేడ) అత్యంత ప్రసి ద్ధి పొందాయి. మఖ్దూం కవితల్లోకెల్లా ప్రత్యేకమైనది ‘అంధేరా’. ఈ కవిత ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గీసిన ‘గుయెర్నికా’ చిత్తరువును, కవితలా మఖ్దూం అనువదించినట్లు ఉంటుందని చెప్తుండేవారు వామపక్ష నేత రాజబహదూర్ గౌర్.
సినిమాల్లో మఖ్దూం గజళ్లు..
‘సిపాహీ’, ‘ఆజాదీకి -ఏ- వతన్’, ‘రక్స్’ కవితలు మఖ్దూంకు జాతీయస్థాయిలో ఖ్యాతిని తీసుకువచ్చాయి. గజళ్లు రాయడంలో మఖ్దూం సిద్ధహస్తుడు. వాటిలో కొన్నింటిని బాలీవుడ్లో సినిమాల పాటల కోసం వాడారు అప్పటి సంగీత దర్శకులు. వాటిలో ‘జానే వాలే సిపాహీ పూఛో..’, ‘దో బదన్ ప్యార్ కే ఆగ్ మే జలే’, ‘ఆప్ కీ యాద్ ఆతీ రహే రాత్ భర్’ పాటలు ఇప్పటికీ గజల్, సంగీత ప్రియులను ఆకర్షిస్తున్నాయి.
ఆయన షాయిరీ లు, గజళ్లు అప్పటి హైదరాబాద్ గల్లీ గల్లీలో వినిపించేవి. హోటళ్లు, క్లబ్బులు, టీ దుకాణాల వద్ద సర్వర్లు, బట్లర్లు వల్లె వేసేవారంటే ఆతిశయోక్తి కాదు. మఖ్దూం రాసిన ‘ఆప్ కీ యాద్ ఆతి రహీ రాత్ భర్.. చష్మ్ ఎఱూ -నమ్ ముస్కురాతీ రహీ రాత్ భర్’ అనే గజల్ చాలా ప్రసిద్ధమైనది. హిందీ చిత్రం ‘గమన్’లో మేకర్స్ ఈ గజల్‌ను వినియోగించుకున్నారు. మఖ్దూం సాహిత్యం, ఛాయా గంగూలీ గాన మాధుర్యం శ్రోతల మనసులను ఆకట్టుకుంటాయి.
అలాగే ‘బజార్’ సినిమాలో లతా మంగేష్క ర్, తలత్ అజీజ్ పాడిన ‘ఫిర్ ఛిడీ రాత్ బాత్ ఫూలోన్ కీ రాత్ హై యా బారాత్ ఫూలోన్ కీ’ అనే పాట చాలా ఫేమస్. ఇక ‘చా చా చా’ చిత్రంలో ‘ఏక్ చమేలీ కే మం డవే తలే మై కదా ఖోల్‌కర్ బైఠా హై కోయి’ అనే పాట మఖ్దూం కలం పటిమకు చక్కటి ఉదాహరణ. మహమ్మద్ రఫీ, ఆశా భోంస్లే గాత్రంలో వచ్చిన పాటకు అశేష మంది అభిమానులున్నారు.
జీవిత విశేషాలపై డాక్యుమెంటరీ..
మఖ్దూం జీవిత విశేషాలపై విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌తో అలీ సర్దార్ జాఫ్రీ అనే నిర్మాత ‘కాక్షన్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీలో మఖ్దూం పాత్రలో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ ఒదిగిపోయా డు. ఆ వీడియో ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. యువ కవులు, రచయితలను మఖ్దూం చేరదీసిన తీరు, వారిని ప్రగతిశీలురుగా తీర్చిదిద్దిన విధానం.. ఆ డాక్యుమెంటరీలో నిక్షిప్తమై ఉంది.
మఖ్దూం తన సాహిత్యంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించేవాడు. జైలు జీవితంలో మఖ్దూం ఉన్నప్పుడు తోటి ఖైదీల ప్రయోజనాల కోసం రాజీ లేకుండా పోరాడేవాడు. జైలు అధికారుల ఎదుట తోటి ఖైదీలతో కలిసి నిరసన వ్యక్తం చేసేవాడు. అలా ఖైదీల హక్కలు సాధించిన సందర్భాలు అనేకం. అజ్ఞాతవాసం గడిపినప్పుడు, ఆకలి బాధలు ఎదుర్కొన్నప్పుడు కూడా మఖ్దూం కష్టాలకు వెరవలేదు. గుండె నిబ్బరంతో నమ్మిన సిద్ధాంతం కోసమే పనిచేశాడు.
స్త్రీల పట్ల ఆయనకు ఆపారమైన గౌరవం ఉండేది. వారి హక్కుల కోసమూ మఖ్దూం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు. కేవలం సాహిత్యంలోనే కాదు, క్రియా శీలక రాజకీయాల్లోనూ మఖ్దూం ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. 1952 హుజూర్‌నగర్ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఐదేళ్ల పాటు ప్రజలకు సేవలందించా డు. 1958- వరకు ఎమ్మెల్సీగా పనిచేశాడు. 1969లో తనకు ఉర్దూ సాహిత్య విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
ఇదే సంవత్సరం ఆయన ఢిల్లీలో ఉండగా ఆగస్టు 25న గుండెపోటుతో కన్నుమూశారు. బతినంతకాలం ప్రజల్లో చైతన్యాన్ని రగిలిస్తూ ఆ ప్రయాణాన్ని మధ్యలో వదిలి దివికేగిపోయాడు. మఖ్దూం భౌతికంగా దూరమై దశాబ్దాలు గడుస్తున్నా ఆయన పోరాట పటిమ, సాహితీ కృషి మాత్రం ఉర్దూ కవి ఖ్వాజా మహ్మద్ అబ్బాస్ అన్నట్లు తరతరలకూ జలత్ప్రభా దీప్తిజ్వాల.
* భారతభూమికి జ్యోతి తెలంగాణ
నవ భారత భూమికి నేత
తెలంగాణ పిలుస్తున్నది వేరొక బాటకు
నేడు తెలంగాణ విప్లవ సందేశాన్నిందించే
వీర తెలంగాణ..
స్వాతంత్ర పతాక నీడలలో
ఇది సమరం, స్వేచ్ఛా సమరం !!
(ఉర్దూ మూలం: మఖ్దూం)
(తెలుగు అనువాదం: దాశరథి)