15 July, 2026 | 12:41 AM

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బోనాలు

15-07-2026 12:00 AM

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి సమున్నత ప్రతీక బోనాల పండుగ. మట్టి వాసనలను, మనుషుల ఆత్మీయతలను, దైవిక భక్తిని మేళవించి సమర్పించే ఈ ఉత్సవం ఒక పూజా విధానం మాత్రమే కాదు; అది ఈ గడ్డపై జీవించే ప్రజల ఆత్మగౌరవ ప్రకటన, శతాబ్దాల చారిత్రక వారసత్వ వైభవం. ఏటా జూలై లేదా ఆగస్టు మాసాల్లో వచ్చే ఆషాఢ మాసం ఆరంభమైందంటే చాలు, తెలంగాణ సరికొత్త జాతర సందడితో పులకించిపోతుంది.

ఎటు చూసినా పసుపు, కుంకుమల అలంకరణలు, వేపాకుల పచ్చదనం, మంగళకరమైన దీపాల కాంతులు భక్తులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రకృతిని, దైవాన్ని ఒక్కటిగా చూసే ఈ అపురూప పండుగ విశ్వాసాల పునాదులపై నిర్మితమై, నేడు ఒక జాతి సాంస్కృతిక అస్తిత్వంగా రూపాంతరం చెందింది. ప్రాచీన కాలంలో ఋతువుల మార్పుతో పాటు ఆషాఢంలో కురి సే వర్షాల వల్ల కలరా, ప్లేగు వంటి భయంకరమైన మహమ్మారి వ్యాధులు ప్రబలేవి.

నాటి రోజుల్లో ఆధునిక వైద్య సౌకర్యాలు లేకపోవడంతో అమ్మవారి ఆగ్రహం వల్లే ఈ అంటురోగాలు వస్తున్నాయని నమ్మిన జానపదులు, ఆమెను శాంతింపజేయడానికి ఈ బోనాల పూజలను ప్రారంభించారు. ఈ ఉత్సవాల వెనుక భాగ్యనగర చరిత్రతో ముడిపడిన అనేక చారిత్రక సంఘటనలు, పూర్వాపరాలు ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత, ఈ ప్రాంతపు సాం స్కృతిక వారసత్వానికి సముచిత గౌరవం కల్పిస్తూ ప్రభుత్వం బోనాలను ‘రాష్ట్ర పండుగ’గా అధికారికంగా ప్రకటించింది.

కాగా, భాషాపరంగా పరిశీలిస్తే, ప్రకృతి రూపమైన ‘భోజనం’ అనే పదం కాలక్రమేణా జానపదుల నోళ్లలో నాని వికృతి రూపమైన ‘బోనం’గా మారింది. జానపదులు తమను చల్లగా చూసే గ్రామ దేవతలకు సమర్పించే పవిత్ర నివేదనే ఈ బోనం. బోనాన్ని కొత్త మట్టి కుండలో లేదా రాగి పాత్రలో ఎంతో పవిత్రంగా వండుతారు. బియ్యం, పాలు, బెల్లం కలిపి వండిన పాయసాన్ని, కొన్ని ప్రాంతాలలో పెరుగు, ఉల్లిపాయలతో కూడి న అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

మహిళలు ఈ బోనాల కుండల ను వేపాకులు, పసుపు, కుంకుమ, తడి తెల్ల ముగ్గులతో ముస్తాబు చేస్తారు. ఆ కుండపై ఒక దీపాన్ని వెలిగించి, దానిని తమ తలపై ఉంచుకుని, మంగళవాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, ఆటపాటల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు.ఈ పండుగలో అత్యంత ఆకర్షణీయమైన, శక్తివంతమైన పాత్ర అమ్మవారి సోదరుడిగా భావించే ‘పోతరాజు’. బలిష్టమైన కాయం, ఒంటి నిండా పసుపు, నుదుటున పెద్ద కుంకుమ బొట్టు, కాళ్లకు గజ్జెలు, చిన్న ధోవ తి ధరించిన పోతరాజు, డప్పు వాయిద్యాల వేగానికి అనుగుణంగా రౌద్ర రూపంతో నర్తిస్తాడు.

ఆయనే పూజారంభకుడిగా, భక్తజన రక్షకుడిగా వ్యవహరిస్తాడు. చేతిలో ఉన్న కొరడాతో తనను తాను కొట్టుకుంటూ, ఒంటికి వేపాకులను చుట్టుకుని, పూనకం వచ్చిన భక్తులను అమ్మవారి సన్నిధికి నడిపిస్తాడు. జాతర ముగింపు దశలో పోతరాజుకు వచ్చే పూనకం, ఆయన చూపే వికృతమైన ఆగ్రహాన్ని శాంతింపజేయడానికి కొమ్ములున్న మేకపోతును అందించడం ఒక ఆచారం. పోతరాజు తన దంతాలతో ఆ మేక తలను మొండేన్ని వేరు చేసి పైకి ఎగరేసే ఘట్టం అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది.

ఈ ఏడాది బోనాల ఉత్సవాలు జూలై 16 నుంచి ప్రారంభమై ఆగస్టు 13 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. తొలి బోనం జూలై 16న చారిత్రక గోల్కొండ కోటలో ఘనంగా ప్రారంభం కానుంది. జూలై 19, 26, ఆగస్టు 2, 9వ తేదీలలో నగరంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. సికింద్రాబాద్ లష్కర్ బోనాలు, లాల్ దర్వాజా మహంకాళి బోనాలు ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే విలక్షణమైన శక్తి ఈ పండుగకు ఉంది.

కులమతాలకతీతంగా, ధనిక పేద భేదం లేకుండా అందరూ కలిసి ఆషాఢ లక్ష్మిని కొలవడం తెలంగాణ సమాజపు సామూహిక జీవన సౌరభాన్ని చాటిచెబుతుంది. తరాలు మారినా చెదరని భక్తితో, సడలని ఉత్సాహంతో జరుపుకొనే బోనాల పండుగ, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ, భవిష్యత్ తరాలకు మన మూలాలను అందించే అద్భుత వారసత్వ దీపికగా నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. 

రామకిష్టయ్య సంగనభట్ల 

వ్యాసకర్త: జర్నలిస్ట్, 9440595494