15 April, 2026 | 3:56 AM

మళ్లీ ‘హస్తం’దే అధికారం

15-04-2026 01:36 AM
  1. పొర్లుదండాలు పెట్టిన బీఆర్‌ఎస్ గెలవదు
  2. ఖమ్మం కాంగ్రెస్‌కు గుండెకాయ
  3. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు
  4. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

ఖమ్మం, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్ర కాదు.. పొర్లు దండాలు పెట్టినా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ గెలవబోదని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ రాబో యేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, 100 సీట్లతో అతిపెద్ద రికార్టు విజయాన్ని కాంగ్రెస్ నమోదు చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

మంగళవారం ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డీసీసీ కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహేష్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా ఖమ్మం జిల్లాకు చేరుకున్న మహేష్‌కుమార్‌గౌడ్, భట్టి విక్రమార్కకు కోదాడ క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జడ్పీసెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ దేశానికి గుండెకాయ కాంగ్రెస్ అని, పార్టీకి గుండెకాయ ఖమ్మం అని అన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాపాడుకోవాలని, కార్యకర్తలు లేనిదే నాయకుకలు లేరని అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చింది, అభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే అని తెలిపారు.

పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశాభివృద్ధికి పునాదులు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని వివరించారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో విజయం కార్యకర్తల కృషి ఫలితమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ ఫలాలను అందించేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి వివరించారు. కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురామారెడ్డి, ఎమ్మెల్యేలు మాలోతు రాందాసునాయక్, మట్టా రాగమయి, గిడ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.