16 July, 2026 | 12:44 AM

నెన్నెల పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ

16-07-2026 12:31 AM

బెల్లంపల్లి, జూలై 15: బెల్లంపల్లి నియోజక వర్గంలోని నెన్నెల పోలీస్ స్టేషన్ ను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ బుధ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, రిసెప్షన్ సెంటర్లోని సిబ్బందితో మాట్లాడి రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్లైన్లో వివరాల నమోదు, రికార్డుల అప్లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు.

రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల ఫైళ్లు, నేరాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి,పెండింగ్ వ్యవహారాలపై సీఐ హనోక్, ఎస్‌ఐ రామకృష్ణరావును అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ దర్యాప్తులో భాగంగా ప్రతి నేరస్థలాన్ని తప్పనిసరిగా సందర్శించాలని, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిర్వహించి ఆధారాలను నమోదు చేయాలని సూచించారు. ఈ-సాక్ష్య అప్లికేషన్లో సంబంధిత సమాచారాన్ని వెంటనే అప్డేట్ చేయాలని, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం రాత్రి పెట్రోలింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.