21 May, 2026 | 2:41 AM

జంట హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష

21-05-2026 12:00 AM

తీర్పు చెప్పిన వరంగల్ ౧వ అదనపు న్యాయమూర్తి

వరంగల్, మే 20 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పదహారు చింతల్ తండాలో 2024 జులైలో చోటుచేసుకున్న జంట హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్యాభర్తలను హత్య చేసి, ఇద్దరిని తీవ్రంగా గాయపరిచిన కేసులో బుధవారం నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ 1వ అదనపు జిల్లా న్యాయమూర్తి జే. మైత్రేయి కఠిన తీర్పు వెలువరించారు. ఈ కేసులో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజును అలియాస్ బన్నీ దోషిగా తేలాడు.

సరైన సాక్ష్యాధారాలు పోలీసులు కోర్టుకు సమర్పించడంతో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు అదనపు న్యాయమూర్తి మైత్రేయి బుధవారం తీర్పు ప్రకటించారు. అదనంగా రూ.5 వేల జరిమానా కూడా విధించింది. కాగా ఈ ఘటనలో బానోత్ సుగుణ (45), ఆమె భర్త బానోత్ శ్రీను (50) ప్రాణాలు కోల్పోగా, బానోత్ దీపిక (21), బానోత్ మదన్ లాల్ (17) తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ దారుణ ఘటనపై బానోత్ ఈరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.