21 May, 2026 | 2:32 AM

కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి

21-05-2026 12:00 AM
  1. ఆటలాడుకుంటుండగా ప్రమాదం 
  2. మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ఘోర విషాదం

జగిత్యాల, మే 20 ( విజయక్రాంతి ) : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆటలాడుకుంటూ వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన మేడిపల్లి మండల పరిధిలోని కొండపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఒకేసారి ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. కొండపూర్ గ్రామానికి చెందిన మనవిత్ (10), మనస్విని (9), షర్వింద్ (7) లు ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో గ్రామంలోని కోనేరు సమీపంలోకి వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు కోనేరులో పడిపోయారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటి నుంచి బయటకు రాలేక ఊపిరాడక ముగ్గురూ నీటిలోనే ప్రాణాలు విడిచారు. వెంటనే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో కోనేరులో గాలించి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.