30 August, 2026 | 9:17 AM

రైతుల పొట్టకొట్టి రంగురాళ్ల (క్వారీ)మైనింగా ?

30-08-2026 08:43 AM

‘‘మా ప్రాణాలకు విలువ లేదా?’’.. కూన హేమలత నిలదీత

ప్రజాభిప్రాయ సేకరణలో రైతుల ఆగ్రహం.. రసాభాసగా సమావేశం

హుస్నాబాద్/అక్కన్నపేట: రైతుల జీవనాధారమైన భూముల్లో రంగురాళ్ల క్వారీ ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం(Akkannapet Mandal) రేగొండ రెవెన్యూ గ్రామ శివారు పరికిబండ ప్రాంత రైతులు తేల్చిచెప్పారు. సద్గురు ఎక్స్పోర్ట్స్ ప్రతిపాదిత కలర్ గ్రానైట్ మైనింగ్ క్వారీకి సంబంధించి శనివారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం రైతుల తీవ్ర అభ్యంతరాలతో రసాభాసగా మారింది. సర్వే నంబర్ 897లో ప్రతిపాదిత క్వారీ ఏర్పాటుపై స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు, గ్రామ ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఎలా నిర్వహిస్తారని అధికారులను ప్రశ్నించారు. సమావేశంలో స్థానికుల కంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినట్లు కనిపించిన ఎన్జీవో ప్రతినిధులే ఎక్కువగా ఉండటంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

‘‘మీ ప్రాణాలకు కోటి.. మా ప్రాణాలకు విలువ లేదా?’’

సమావేశంలో ఓ ఎన్జీవో ప్రతినిధి క్వారీలో కార్మికుడు మృతిచెందితే బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని సూచించడంతో పరికిబండకు చెందిన యువ రైతు కూన హేమలత తీవ్రంగా స్పందించారు. ‘‘మీ ప్రాణాలకు కోటి రూపాయలు.. మా ప్రాణాలకు విలువ లేదా? మా భూములు, పంటలు నాశనమైతే మాకు ఎవరు పరిహారం ఇస్తారు?’’ అంటూ ఆమె అధికారులను నిలదీశారు. తాము సన్న, చిన్నకారు రైతులమని, వ్యవసాయం, పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తున్నామని చెప్పారు. గతంలో ఇదే ప్రాంతంలో క్రషర్ కార్యకలాపాల కారణంగా నాలుగైదేళ్ల పాటు పంటలు పండలేదని, ఇటీవలే మళ్లీ వ్యవసాయం చేసుకుంటున్న సమయంలో మరో క్వారీ ప్రతిపాదన రావడం తమకు ఆందోళన కలిగిస్తోందన్నారు. ‘‘పొద్దస్తమానం కష్టపడితేనే మా పొట్ట నిండుతుంది. దుమ్ము, ధూళితో భూములు పనికిరాకపోతే మా బతుకులు ఏమవుతాయి? రైతుల పొట్టకొట్టి అభివృద్ధి పేరుతో క్వారీలు వద్దు’’ అని హేమలత స్పష్టం చేశారు.

అనుమతులు అంత సులువేనా?

కలర్ గ్రానైట్ క్వారీ ఏర్పాటు కేవలం ప్రజాభిప్రాయ సేకరణతో పూర్తయ్యే వ్యవహారం కాదని రైతులు పేర్కొన్నారు. గనుల శాఖకు సంబంధించిన క్వారీ లీజ్ ప్రక్రియతో పాటు, ప్రాజెక్టు స్వభావం, విస్తీర్ణం, పర్యావరణ ప్రభావాన్ని బట్టి అవసరమైన పర్యావరణ, కాలుష్య నియంత్రణ, భూ సంబంధిత ఇతర అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలిపారు. క్వారీ వల్ల పంటలు, భూములు, నీటి వనరులు లేదా ఇతర ఆస్తులకు నష్టం జరిగితే దానికి బాధ్యత ఎవరిది? నష్టాన్ని ఎవరు అంచనా వేస్తారు? పరిహారం ఎలా చెల్లిస్తారు? అనే ప్రశ్నలు రైతుల్లో వ్యక్తమయ్యాయి.

‘‘రైతుల ఉసురు తగలకూడదు’’

‘‘దేశానికి రైతులే వెన్నెముక అంటారు. అదే రైతుల భూములు బీడువారేలా చేస్తే మేమెక్కడికి వెళ్లాలి? అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తే తలవంచి నమస్కరిస్తాం. రైతులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోం’’ అని హేమలత హెచ్చరించారు.కాగా జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ మాట్లాడుతూ 19 మంది రిప్రజెంటేషన్లు అందాయని, రేగొండ రెవెన్యూ గ్రామం కావడంతో సంబంధిత సర్పంచ్‌కు సమాచారం ఇచ్చామని తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను నమోదు చేశామని, అయితే క్వారీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం తమ చేతుల్లో లేదని స్పష్టం చేశారు.‘‘మేము ఎవరికీ మద్దతుగా లేదా సిఫారసు చేయడానికి ఇక్కడ లేము. ఇది కేవలం ప్రజాభిప్రాయ సేకరణ మాత్రమే’’ అని తెలిపారు.రైతుల అభ్యంతరాలు, పర్యావరణ ప్రభావాలు, భూముల పరిస్థితి, పంటలపై ప్రభావం తదితర అంశాలను అధికారులు ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటారో.. ప్రతిపాదిత రంగురాళ్ల క్వారీకి తుది అనుమతులు లభిస్తాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.