16 July, 2026 | 3:05 PM

రొమాంటిక్ కామెడీ ఎక్స్‌ప్రెస్

14-06-2024 12:05 AM

చైతన్యరావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. బాల రాజశేఖరుని దర్శకత్వంలో న్యూ రీల్ ఇండియా బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, సుహాసిని, అలీ తదితరులు ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్నదీ చిత్రం. కల్యాణి మాలిక్ సంగీత సారథ్యం వహిస్తుండగా, ఆర్‌పీ పట్నాయక్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. ఈ నెల 21 ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు బాల మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా రూపొందించాం. 30 వెడ్స్ 21 చైతన్య రావును, కుమారి 21ఎఫ్ హెబ్బా పటేల్‌ను జంటగా చూపించడమే మా ప్రత్యేకత. వీరిద్దరికీ వేర్వేరు ఇమేజ్‌లు ఉన్నాయి. మా సినిమాలో వీరి జంట ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుంది. ఇది మంచి రొమాంటిక్ కామెడీ మూవీ ఇది’ అని చెప్పారు. హీరో చైతన్య మాట్లాడుతూ.. “అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన పాత్రలో నటించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.

అలాంటి అవకాశం నాకు ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ ద్వారా దక్కింది. ప్రేమికులు, పెళ్లి చేసుకోబోయే జంటలు, చేసుకున్న జంటలు, పెళ్లు 25 ఏళ్లు గడిచిన జంటలు.. అందరికీ నచ్చేలా ఉంటుందీ సినిమా” అన్నారు. ‘ఈ సినిమాతో ఆసక్తికరమైన, అనుభూతి పొందే ప్రయాణం చేశాం’ అని హీరోయిన్ హెబ్బా తెలిపింది. కార్యక్రమంలో సినీ రచయిత విజయేంద్రప్రసాద్, రమేశ్ ప్రసాద్, దర్శకుడు దశరథ్, అవసరాల శ్రీనివాస్, గాయకుడు దీపు తదితరులు పాల్గొని మాట్లాడారు.