24 February, 2026 | 10:07 PM

అడవుల నరికివేతతో భవితకు ప్రమాదం

24-02-2026 08:02 PM

ఇసుక కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు భారీ వృక్షాల నేలమట్టం

28న ఆదివాసీ సంఘాలతో  ఫారెస్ట్  కార్యాలయం ముట్టడి

తుడుండెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలెం కోటి

మణుగూరు,(విజయక్రాంతి): అడవులను రక్షించాల్సిన అధికారులే వందల ఎకరాల్లో భారీ వృక్షాలను నరికివేసి, అడవులను ధ్వంసం చేస్తూన్నారని, అర్ధరాత్రికి రాత్రే రహదారులు నిర్మించి, ఇసుక ర్యాంపుల కోసం ఫారెస్ట్ అధికారులే  అక్రమార్కులకు అండగా ఉంటూ వారికి కొమ్ముకాస్తున్నారని తుడుండెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలెం కోటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవులు ఆదివాసీల జీవనాధారమని, ఒక వైపు ప్రకృతిని, అడవులను సంరక్షించాలి.

సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వనసంరక్షణ, హరితహారం వంటి పథకాలపై రూ.వేల కోట్లు ఖర్చు పెడితే, ఆ అడవులను రక్షించాల్సిన అటవీ అధికారులు మాత్రం మణుగూరులో డబ్బులకు లోబడి అక్ర మార్కులతో చేతులు కలిపి అడవులను భూస్థాపితం చేస్తున్నారని ఆరోపించారు.  మండల కేంద్రంలోని రధం గుట్ట అటవీ భూములపై అక్రమార్కుల కన్నుపడిందని, ఫారెస్ట్ అధికారులు అండతో రోడ్డు నిర్మాణం పేరుతో జేసీబీలతో వేల చెట్లను  నరికి, గుట్టలను సైతం కొలగొడుతున్నారని విమర్శించారు. 

పేదవాళ్ళు కట్టెలు కొట్టుకున్నా, పశువులను మేపుకున్నా  కేసులు పెట్టే ఫారెస్ట్ అధికారులు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా అడివిని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అటవీ అధికారులు మాత్రం అడవులకు కాలాయములై భావి తరాల భవిష్యతును ప్రశ్నారకం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశా రు.

అధికారుల అక్రమాలను ఎండగట్టేందుకు ఈ నెల 28న ఎఫ్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ముట్టడి కార్యక్రమంలో అఖిల పక్ష సంఘాలు, ఆదివాసీ సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. సమావేశం లో జిల్లా కాంగ్రెస్ నాయకులు గురిజాల గోపీ, రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ, ఎండి షబానా, కోరి శ్యామల, కన్నాపురం వసంత, డేరంగుల సుజాత, రెడ్డి బోయిన రేణుక, కన్నాపురం శైలజ, లక్కింశెట్టి హేమలత పాల్గొన్నారు.